యుద్ధకాంక్ష లేదు
కాలు దువ్వితే సిద్ధమే
ఐఎన్‌ఎస్ కోల్‌కతా జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోడీ
ముంబై, ఆగస్టు 16 (జనంసాక్షి) : భారత్‌కు యుద్ధ కాంక్షలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. ఏ దేశమైనా యుద్ధానికి కాలు దువ్వితే తాము సిద్ధమేనని ప్రకటించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశంలోనే అతిపెద్ద యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ కోల్‌కతా’ను శనివారం ముంబై తీరంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. యుద్ధానికి సిద్ధమే.. కానీ కయ్యానికి కాలు దువ్వమని వ్యాఖ్యానించారు. భారత సైన్యం బలం అమోఘమైనదన్నారు. భారత జాతి వైపు ఎవరూ దృష్టిసారించలేని విధంగా సైన్యాన్ని ఆధునికీకరిస్తామని చెప్పారు. ఐఎన్‌ఎస్ కోల్‌కతా తయారీలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. మన దేశ భారతదేశాన్ని కాపాడుతున్నది సైనిక దళాలేనని ప్రశంసించారు. ‘ఈ రోజుల్లో యుద్ధం చేయడం, విజయం సాధించడం పెద్దగా కష్టం కాదు. కానీ యుద్ధమే రాకూడదు. అధునాతన, ఆయుధ సంపత్తి కలిగిన భారత్ కచ్చితంగా యుద్ధానికి వ్యతిరేకమే. మనం సర్వశక్తివంతంగా ఉంటే.. మనవైపు ఎవరూ సవాలు చేయలేరని’ అన్నారు. సైన్యం ఆధునికీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ‘జవాన్లు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. యావత్ భారతావని విూ వెంట ఉందని’ చెప్పారు. భారత స్వదేశీ సాంకేతిక నిర్మాణ సామర్థ్యానికి ఐఎన్‌ఎస్ కోల్‌కతా నిదర్శనమని కొనియాడారు. దీని ద్వారా సమాచార సేకరణ మరింత పెరగనుందని చెప్పారు. మన సైన్యం బలం అమోఘమైంది.. ఐఎన్‌ఎస్ కల్‌కతా చేరిక తర్వాత భారత రక్షణ సామర్థ్యాన్ని ఏ దేశమూ సవాలు చేయలేదని మోడీ పేర్కొన్నారు. ఇక నుంచి సైన్యం బలం మరింత పెరిగిందని తెలిపారు. రక్షణ శాఖ టెక్నాలజీని పెంచేందుకు ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. కేంద్ర రక్షణ శాఖమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఇవాళ దేశానికి, రక్షణ శాఖకు చారిత్రాత్మకమైన రోజని అభివర్ణించారు. నేవీ చీఫ్ అడ్మైరల్ ఆర్‌కే ధావన్, నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.