ఓటు మరింత రహాస్యం

2

కొత్త యంత్రం కొనుగోలు చేసిన ఈసీ

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి) : ఓట్ల లెక్కింపు సమయంలో ఓటింగ్‌ సరళి వెల్లడికాకుండా నివారించేందుకు కొత్త యంత్రాన్ని వినియోగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రతిపాదిస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తిచేయడానికి ‘టోటలైజర్‌’ అనే యంత్రాన్ని ప్రవేశపెట్టేందుకు న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ ఒక ప్రతిపాదన సమర్పించింది. ఒక పోలింగ్‌ కేంద్రంలో ఓట్ల సరళి ఎలా ఉందో తెలియకుండా చేయడంతోపాటు ఓట్లను కలగలపడం, మరింత గోప్యత పాటించడం కోసం ఈ యంత్రం అవసరమని ఈసీ భావిస్తోంది. దీంతో పాటు 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య 9,30,430 కంట్రోల్‌ యూనిట్లను, 13,95,647 బ్యాలెట్‌ యూనిట్లను కొనుగోలు చేయడానికి ఈసీ ప్రతిపాదనలు సమర్పించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో గరిష్ఠంగా నాలుగు బ్యాలెట్‌ యూనిట్లకు ఒక కంట్రోల్‌ యూనిట్‌ చొప్పున ఉంటుంది. ఈవీఎంల జీవితకాలం 15 ఏళ్లు. 2000-01లో కొనుగోలు చేసిన 1,42,631 ఈవీఎంలను 2015-16లో తొలగించాల్సి ఉంది.