కీలకాంశాలపై చర్చించాం : చంద్రబాబు

4

హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : గవర్నర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలకాంశాలపై చర్చించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రెండు రాష్ట్రాల మద్య ఇంకా చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సి ఉందని, ఆ దిశగా ముందుకు పోవడానికి ఆదివారం రాజ్‌భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన విూడియాతో మాట్లాడుతూ గవర్నర్‌ నరసింహన్‌ దగ్గర మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల విభజనకు ప్రత్యూష్‌ సిన్హా కమిటీ పరిశీలిస్తుందని, వారం రోజుల్లో పూర్తికావచ్చునని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రస్థాయిలో కమల్‌నాథన్‌ కమిటీ సెక్రటేరియట్‌గానీ, డైరెక్టరేట్స్‌కానీ, కమిషనరేట్స్‌గానీ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు పరస్పరం సహకరించుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. ఒక వేళ వారివల్ల పరిష్కారం కాకపోతే ఇద్దరు సీఎంలం కూర్చోని సమస్య పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. షెడ్యూల్‌ 9, 10లపై చర్చ జరిగిందని, ఆ రెండు షెడ్యూల్‌లో లేని సంస్థల ప్రస్తావన కూడా వచ్చిందని, మిగిలిన సమస్యలను ఎప్పటికప్పుడు ఏ విధంగా పరిష్కరించాలో ఇద్దరం ప్రయత్నిస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాలు భౌగోళికంగా రెండుగా విడిపోయినా తెలుగువారు ఒక్కటేనని, తెలుగువారందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విభజనలో కొన్ని సమస్యలు వచ్చాయని, విభజన హేతుబద్ధంగా లేదని ఆయన అన్నారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని చంద్రబాబు వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని, దీని కోసం కేంద్రం జోక్యం చేసుకుని ఏమేమి చేయాలో చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అలా అయితేనే అభివృద్ధిపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండు నెలలు దాటినా పాలనపై దృష్టిపెట్టలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులం సహకరించుకుని అందరికీ న్యాయం జరిగేలా కృషిచేస్తామని ఆయన అన్నారు. వివాదాలకు ఆస్కారమిస్తే సమయమంతా వాటికే సరిపోతుందని, వివాదాల వల్ల నష్టమేకానీ లాభముండదని బాబు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలపై పరస్పర అవగాహన కుదిరిందని, విభజనవల్ల స్పష్టత లేకపోవడంవల్లే సమస్యలు వచ్చాయని ఆయన అన్నారు. సమస్యలపై రెండు ప్రభుత్వాలు అవగాహన పెంచుకోవాలని.. గట్టిగా కృషిచేస్తే సమస్యల పరిష్కారం పెద్ద కష్టమేమికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో సమానంగా ఒక లెవెల్‌ వచ్చేవరకు సహకరించాల్సిన అవసరం ఉందని, నిధులు, పాలసీల విషయంలో పూర్తి సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంచేసినట్లు ఆయన చెప్పారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటామని, కేసీఆర్‌ సహకారాలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇద్దరం సహకరంచుకుని అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.