సమగ్ర సర్వేకు కదిలిన జనం
బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు
హైదరాబాద్, ఆగస్టు 17 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు పట్టణాల్లోని ప్రజానీకం ఊరుబాట పడుతున్నారు. ఈ నెల 19న సర్వేలో పాలుపంచుకుని ప్రభుత్వానికి తోడ్పాటునందించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆదివారం, సోమవారం (శ్రీకృష్ణాష్టమి) సెలవురోజులు కావడంతో శనివారం మధ్యాహ్నం నుంచే పట్టణాల్లోని ప్రజలు కుటుంబాలతో సొంత గ్రామాలకు పయనమయ్యారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు వారి స్వంత గ్రామాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శనివారం హైదరాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్, ఇవ్లిూబన్ బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. జిల్లాలకు అదనంగా ఐదు వందల వరకు ప్రత్యేక బస్సులు లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. సర్వేకు మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే రోజున సొంతూరులో ఉండి సర్వే ద్వారా తెలంగాణ ఉనికిని చాటిచెప్పాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతున్నది. ఇలా ఉండగా, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలో భాగస్వాములయ్యే ఎన్యూమరేటర్లు ఆది, సోమవారాల్లో ప్రాథమికంగా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించి ఇంటి నంబర్లను వెతికి, ఇంటింటికి స్టిక్కర్లను అతికించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్యూమరేటర్లకు ఒక్కొక్కరికి ముప్పై ఇళ్ళను కేటాయించడంతో ఆది, సోమవారాల్లో వారు ముందుగానే ఇంటింటికి వెళ్ళి సర్వేకు సంబంధించి సమాచారాన్ని తెలియజేయడంతోపాటు సర్వేకు సంబంధించి కరపత్రం, చెక్‌లిస్టులు పంపిణీ చేస్తారు. మంగళవారం సర్వేకు వచ్చే సమయంలో ఇంట్లో అందుబాటులో ఉండాలనే సూచనలు ఇవ్వనున్నారు. సర్వే కోసం ఎన్యూమరేటర్లు తమ ఇండ్లకు రాని పక్షంలో ప్రజలు ఫిర్యాదు చేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కాల్‌సెంటర్ నంబర్లను ఏర్పాటుచేసే బాధ్యత జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఒక్కో ఎన్యూమరేటర్‌కు మూడు నుంచి ఆరుగురు చొప్పున అసోసియేట్ ఎన్యూమరేటర్లుగా వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులను నియమించారు. అంతేకాకుండా ఒకవేళ విద్యార్థులు చివరి నిముషంలో రాకున్నా వెంటనే రంగంలోకి దింపేందుకు నర్సింగ్ కాలేజీల విద్యార్థులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లను అధికారులు సిద్ధంచేశారు.