ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్
హైదరాబాద్, ఆగస్టు 18 (జనంసాక్షి) :
టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నె ప్రభాకర్‌ను తెలంగాణ శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ)గా నియమించారు. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. గత నెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రభాకర్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఉన్న కర్నె ప్రభాకర్ గత ఎన్నికలలో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే అక్కడ నుంచి టిఆర్‌ఎస్ తరపున కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీచేసి విజయం సాధించారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రభాకర్ పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో పొత్తు కారణంగా పోటీ చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అవకాశం దక్కలేదు. కర్నె ప్రభాకర్ స్వస్థలం సంస్థాన్ నారాయణపురం. తండ్రి జంగప్ప ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రభాకర్ ప్రాథమిక విద్యాభ్యాసం సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ఇక్కడే పదో తరగతి పూర్తిచేశారు. ఇంటర్, డిగ్రీ భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాలలో చదివారు. అనంతరం జర్నలిజం కోర్సు కూడా పూర్తిచేశారు.