మొన్న మెదక్‌.. నేడు బీహార్‌

3

రైల్వే క్రాసింగ్‌ వద్ద ఘోరం

ఆటోను ఢీకొన్న రైలు

ఒకే కుటుంబానికి

చెందిన 20మంది మృతి

పాట్నా, ఆగస్టు 18 (జనంసాక్షి) :

మెదక్‌ రైలు ప్రమాద సంఘటన తరహాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. బీహార్‌లో రైల్వే క్రాసింగ్‌ వద్ద  రైలు ఆటోను ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన  20మంది మరణించారు. ఈ సంఘటన పలువుర్ని కంటతడి పెట్టించింది. రైల్వే క్రాసింగ్‌ వద్ద కాపలా ఉన్నప్పటికీ ఈ ప్రమాదం జరగడం విస్మయం కలిగిస్తోంది. రైలు ఆటోను ఢీకొన్న తర్వాత కొన్ని విూటర్ల మేర ఆటోను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు నుజ్జునుజ్జయ్యారు. ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాద సంఘటనపై బీహార్‌ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. మెదక్‌ జిల్లా మూసాయిపేట వద్ద కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ వద్ద రైలు స్కూలు బస్సును ఢీకొన్న సంఘటనలో 16మంది విద్యార్థులు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాజా సంఘటనతో ప్రయాణికులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.