నేడు సింగపూర్‌కు సీఎం

4

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మొదటిసారిగా తెలుగు ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కేసీఆర్‌ మంగళవారం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు రాత్రికి సింగపూర్‌, మలేషియా పర్యటనకు వెళ్లనున్నట్టు అధికారులు తెలిపారు. సింగపూర్‌లో జరిగే ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో కేసీఆర్‌ పాల్గొంటారు. సీఎం కేసీఆర్‌ వెంట ఆర్థిక మంత్రి ఈటెల, ఇతర అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెల 25న     సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. బంగారు తెలంగాణను నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న కేసీఆర్‌ పారిశ్రామికంగా తెలంగాణను అభివృద్ధి చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని కోరారు. పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని కేసీఆర్‌ భావిస్తున్నారు. హైదరాబాద్‌ను సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని ఆయన పలుమార్లు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలోనే సింగపూర్‌లో జరుగుతున్న సదస్సులో పాల్గొనడమేకాకుండా సదస్సులో ప్రసంగించేందుకు కూడా నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది. వివిధ దేశాల పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్న సదస్సులో పాల్గొనే అవకాశం రావడంపట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో అనుభవాలతో కేసీఆర్‌ తిరిగొచ్చి తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి వేగవంతంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పూర్తిచేసుకొని ఈ నెల 25న తిరిగి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. దీంతో చాలా మంది ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసీఆర్‌ కేబినేట్‌ విస్తరణలో మంత్రి పదవులు ఎవర్ని వరిస్తాయో తెలియాలంటే మరిన్ని రోజులు వేచిచూడాల్సిందే.