మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతాం
పథకాలు మావే పేరు మార్చుతున్నారు
ఎన్డీఎపై సోనియా ధ్వజం
న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. మోడీ ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొడుతోందని సోనియా విమర్శించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన మహిళా కాంగ్రెస్ సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీయే సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. మహిళా బిల్లుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదానికి ఎన్డీయే సర్కారుపై త్వరలోనే పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లు కొన్ని కారణాల వల్ల లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయిందని సోనియా వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎన్డీయే సర్కారు తల వంచైనా బిల్లును పాస్ చేయిస్తామన్నారు.
ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత తొలిసారి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సోనియా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలను మోడీ సర్కారు కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా తాము ఎంతో చేశామని.. తప్పుడు వాగ్దానాలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని ఓడించారని తెలిపారు. ‘మేం ఎంతో చేశాం. కానీ ఇప్పటికీ ప్రజలను కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారు. మా పని, మేం సాధించిన వన్నీ కొంత మంది తప్పుడు వాగ్దానాల ముందు నిలవలేకపోయాయని’ వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీ 70వ జయంతి సందర్భంగా మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషిని సోనియా గుర్తుచేశారు. జనాభా సగ భాగం ఉన్న మహిళలను విస్మరించి ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేదని రాజీవ్ నమ్మేవారన్నారు. మహిళా సాధికారత కోసం రాజీవ్ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లు కల్పించారని, మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కలలు గన్నారని తెలిపారు. రాజీవ్ మృతి తర్వాత ఈ అంశాన్ని ఎవరూ ముందుకు తీసుకెళ్లలేదని చెప్పారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. గతంలో ఇచ్చిన హావిూ మేరకు మహిళా బిల్లును రాజ్యసభలో ఆమోదించామని తెలిపారు. దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీల కారణంగా మహిళా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందలేదన్నారు. ‘ఈరోజు మేం ప్రతిపక్షంలో ఉన్నాం.. అయినా మహిళా బిల్లు పట్ల ఉన్న చిత్తశుద్ధిని వెనక్కు తీసుకోలేదు. వీలైనంత త్వరగా బిల్లు పాసయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని’ చెప్పారు.