శాస్త్రవేత్తలు సైనికుల్లా పనిచేయాలి
కాలంతో కలిసి నడవాలి
ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్ష
న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : శాస్త్రవేత్తలు సైనికుల్లా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. కాలంతో కలిసి నడవాలని సూచించారు. వేగంతో కూడిన పనితనం అవసరమని అభిప్రాయపడ్డారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సదస్సులో మోడీ ప్రసంగించారు. శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలని కోరారు. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సైన్యంతో శాస్త్రవేత్తలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. మన శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని మానవ ప్రయోజనాల కోసం వారి పరిశోధనలు ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని, యుద్ధం, రక్షణ, తదితర రంగాల్లో సత్వర మార్పులను తీసుకొస్తుందని అన్నారు. నిర్దేశిత సమయంలోగా మన పనిని పూర్తిచేయడం ఒక సవాలు అని అన్నారు. ప్రపంచం దేన్నైనా 2020లో పూర్తిచేయాలని నిర్ణయించుకుంటే.. దాన్ని మనం 2018లోపు పూర్తిచేయాలని తెలిపారు. ‘మన శాస్త్రవేత్తలు ల్యాబ్‌లలో తీవ్రంగా కష్టపడుతున్నారు.. వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వారి పరిశోధనలు మానవాళికి ప్రయోజనం చేకూర్చినప్పుడే వారి త్యాగాలకు సార్థకత’ అని వ్యాఖ్యానించారు. విద్యార్థులను పరిశోధనల వైపు ఆకర్షించేలా చూడాలని ప్రధాని కోరారు. పరిశోధన రంగంలో ఉన్న విశ్వవిద్యాలయాలను గుర్తించి, వాటితో శాస్త్రవేత్తలు మమేకం కావాలని, తద్వారా విద్యార్థులను పరిశోధనలవైపు మళ్లించాలని సూచించారు