ఉక్కు మహిళ షర్మిల విడుదల

4

ఇంఫాల్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలనే డిమాండ్‌తో 14ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిలకు విముక్తి లభించింది. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని ఆస్పత్రి నుంచి ఆమె బుధవారం విడుదలయ్యారు. తనను విడుదల చేయడం పట్ల ఇరోమ్‌ షర్మిల సంతోషం వ్యక్తంచేసింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలనే డిమాండ్‌పై వెనక్కు తగ్గబోనని స్పష్టంచేసింది. నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి ఇప్పటివరకు బలవంతంగా ఆమెకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. ఆమె ఉంటున్న గదినే సబ్‌ జైలుగా మార్చారు. అయితే ఇరోమ్‌ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్‌ కోర్టు ఆదేశించడంతో ఆమెకు విముక్తి ప్రసాదించారు. ఒక సమస్యపై ఒకరోజు, రెండు రోజులు, మూడురోజులు ఆందోళన చేస్తేనే అలసిపోతాం. అలాంటి 14ఏళ్ళపాటు ఒక మహిళ నిరాహార దీక్ష చేయడం ఆమె ఉద్యమం స్ఫూర్తికి నిదర్శనం.