నింగికెగిసిన హక్కుల నేత

5
జనం జర్నలిస్టు ఎంటీ ఖాన్‌ ఇకలేరు

హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : సీనియర్‌ పాత్రికేలు మహమద్‌ తాజుద్దీన్‌ అలీఖాన్‌ బుధవారం కన్నుమూశారు. పురానాపుల్‌ దర్గా వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. జర్నలిస్టుగానే కాకుండా పౌర హక్కుల సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలంపాటు సేవలించారు. న్యూ టైమ్‌, ది మెయిల్‌, ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎపి టైమ్స్‌, ట్రిబ్యూ తదితర పత్రికల్లో మహ్మద్‌ తాజుద్దీన్‌ అలీఖాన్‌ పనిచేశారు. 1952లో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున జరిగిన ఉద్యమంలో ఆయన అగ్రభాగాన నిలిచారు. అలాగే 1969లో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారు.   అయితే తాను ఎంచుకున్న బాట ముల్లబాట అని తెలిసినా చివరి వరకు మడమ తిప్పని పోరాట యోధుడు ఆయన. ఎన్నో నిర్బంధాలను అధిగమించి అంతిమంగా ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తి. అవినీతి, దోపిడీ ప్రధాన ఎజెండాగా ఉన్న బూర్జువా సమాజంలో దోపిడీకి గురవుతున్న ప్రజల పక్షాన ఆయన పోరాటం సాగింది. జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేస్తూనే పౌర హక్కుల నేతగానూ పేదల పక్షాన నిలవడి అభినందనీయం. ఒక పనిని మొదలుపెట్టడం గొప్ప కాదు ఆ పని పూర్తయ్యేవరకూ ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా వెన్నుచూపకుండా మందుకెళ్ళేవారే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వ్యక్తుల్లో తాజుద్దీన్‌ అలీఖాన్‌ ఒకరు. బతికున్నంత కాలం తన ఆరాటం పోరాటం కొనసాగాయి. చుట్టూ జరుగుతున్న విషయాలను చూసి మనకెందుకులే అనుకునే సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఆయన నిక్కచ్చిగా నిలబడ్డాడు. ఆటుపోట్లకు వెరవకుండా తన కలంతో ప్రజలను మేల్కొలిపారు.