జార్ఖండ్ దేశానికే వెలుగు
ట్రాన్స్‌మిషన్ లైన్ అంకిత సభలో ప్రధాని నరేంద్రమోడీ
రాంచి, ఆగస్ట్ 21 (జనంసాక్షి) : జార్ఖండ్ రాష్ట్రం దేశానికే వెలుగు తార అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. గురువారం జార్ఖండ్‌లోని రాంచీలో కొత్తగా నెలకొల్పిన ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నరేంద్రమోడీ మాట్లాడుతూ చీకట్లు అలుముకున్న ప్రాంతాలకు వెలుగులు అందించే మహత్తర భూమిక జార్ఖండ్ పోషిస్తోందని అన్నారు. ఇది కేవలం విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్‌మిషన్ లైన్‌కాదని, భారత్‌లో నాలుగు దిక్కులను కలిపే అద్భుతమైన అనుసంధాన వేదిక అని ప్రధాని పేర్కొన్నారు. భారత్‌లోని ప్రాక్పశ్చిమాలను కలిపే అద్భుతమైన అనుసంధాన వేదిక అని ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వపాలనలో ముఖ్యమంత్రులు నిధుల కోసం, పనుల కోసం కేంద్రం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పదేళ్లపాటు ముఖ్యమంత్రుల గోడు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రాలకేం కావాలో తెలుసుకుని తీర్చకపోతే దేశం ముందుకుపోలేదని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నో సహజవనరులున్న జార్ఖండ్‌కి గుజరాత్‌ను మించి అభివృద్ధిలో ముందుకు వెళ్లగల సత్తా ఉందని ప్రధాని అన్నారు. జార్ఖండ్ ప్రజలుకూడా పటిష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. దీనివల్ల తక్షణ అభివృద్ధికి నిర్నయాల జరుగుతాయన్నారు. కేంద్రంలో పూర్తి అధికారంలో ఉన్న తాము ఏదైనా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే సత్తా ఉందన్నారు. ఇదిలావుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మరో ఘర్షణ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే కార్యక్రమాలకు హాజరవ్వకూడదని కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా తమ ముఖ్యమంత్రులను అవమానిస్తోందని ఆ పార్టీ మండిపడుతోంది. అది ప్రజాగ్రహమే తప్ప తమకు సంబంధంలేదని బీజేపీ అంటోంది. తాజాగా గురువారం రాంచీలో జరిగిన ర్యాలీలో నరేంద్రమోదీ సమక్షంలోనే సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా అదే అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలో నాగపూర్‌లో మెట్రో ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నిర్ణయించుకున్నారు. నాగ్‌పూర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించనుండడమే పృథ్వీరాజ్ చవాన్ నిర్ణయానికి కారణం. గత వారం రాయ్‌ఘడ్, సోలాపూర్ నగరాల్లో జరిగిన కార్యక్రమాలకు మోదీతోపాటు చవాన్ కూడా హాజరయ్యారు. ఆ రెండు సందర్భాల్లోనూ చవాన్ వెక్కిరింతలను ఎదుర్కోవలసి వచ్చింది. బీజేపీ కార్యకర్తలే తనను ఆపహాస్యం చేస్తున్నారని చవాన్ అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్ వెళ్ళినా అదే పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. హుడా తర్వాత సోరెన్‌కూ తప్పలేదు! ప్రధాని నరేంద్రమోడీ జార్ఖండ్‌లో పవర్ ప్రాజెక్టు పార్రంభానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది భాజపా కార్యకర్తలు మోడీకి మద్దతుగా నినాదాలు చేయడమేకాక సోరెన్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. ఇటీవలే హర్యానాలో ప్రధాని కార్యక్రమంలో ప్రజలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హుడాకు వ్యతిరేకంగా మోడీకి మద్దతుగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో మోడీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫృథ్వీరాజ్ చవాన్ దూరంగా ఉన్నారు. అయితే సోరెన్ కూడా జార్ఖండ్‌లో ప్రధాని కార్యక్రమం నేపథ్యంలో ముందుగానే పీఎంవో వర్గాలతో సంప్రదించారు. తనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలని చెప్పారు. అయినప్పటికీ సోరెన్‌కు ఇబ్బందులు తప్పలేదు. ఈ ఘటన అనంతరం సోరెన్ మాట్లాడుతూ ఈ వేదికకు గౌరవం ఇవ్వాలని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ-జార్ఖండ్ పర్యటపై బీహార్ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మంజ్హీ ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీహార్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో పొరుగున్న జార్ఖండ్‌లో పర్యటనకు రావాలా అంటూ నిలదీశారు. జార్ఖండ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శ్రీకారం చుట్టడం, పలుచోట్ల ప్రసంగాలు చేయడంపై జితన్ రామ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీని ప్రభావం ఉప ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మోడీ జార్ఖండ్ పర్యటనపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని కోరారు. మోడీ ప్రభంజనం తగ్గిపోయిందన్నారు. బూటకపు హావిూలతో సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. భవిష్యత్ లో మోడీ మ్యాజిక్ పనిచేయదని జితన్‌రామ్ అన్నారు.