ముంబయి తరహాలో మన హైదరాబాద్‌

4

మున్సిపల్‌, పోలీస్‌, రవాణా సదుపాయాలపై అధ్యయనం చేస్తున్నాం

మంత్రులు నాయిని, మహేందర్‌రెడ్డి

ముంబయి, ఆగస్టు 21 (జనంసాక్షి) : ముంబయి తరహాలో హైదరాబాద్‌ నగరంలో సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తామని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌, పోలీస్‌, రవాణా సదుపాయాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్‌, సిటీ బస్సుల నిర్వహణ, రవాణా నిబంధనలు తదితర అంశాలను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కూడిన 10 మంది బృందం గురువారం ముంబయిలో పర్యటించింది. ఇదే విధమైన రవాణా సదుపాయాలను హైదరాబాదులో కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. ఇక్కడ రవాణా వ్యవస్థపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌కు నివేదించి ఈ విధానం అమలుకు కృషిచేస్తామన్నారు.  హైదరాబాదులో ప్రయాణ వసతులు మెరుగుపరచడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెప్పారు. ఆమేరకు ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీసు శాఖలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు ఇచ్చారని వివరించారు. విమానాశ్రయం నుంచి బెస్ట్‌ అధికారులు ఏర్పాటు చేసిన ఎయిర్‌కండిషన్డ్‌ బస్సులో నగరంలో వారు పర్యటించారు. హైదరాబాద్‌ను విశ్వకేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కలలు కంటున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాదులో 35లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వీరికి మెరుగైన రవాణా సదుపాయాలు కలిగించేందుకు ముంబయి తరహాలో ట్రాఫిక్‌ కంట్రోల్‌, టెర్మినల్‌ సిస్టమ్‌ అమలు చేయాల్సి ఉందని మంత్రులు నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

బస్‌స్టాపుల్లో క్యూ విధానం అద్భుతం

ముంబయిలో సబర్బన్‌, మెట్రో, బెస్ట్‌ సేవలు అద్భుతమని మంత్రులు నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి కితాబిచ్చారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా మంచి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ముంబయిలో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలను బెస్ట్‌ అందిస్తోందని, వీరు అనుసరిస్తున్న విధానం ఎంతో బాగుందన్నారు. ప్రత్యేకించి బస్‌స్టాపుల్లో ప్రయాణికులు అనుసరిస్తున్న క్యూ విధానం మెచ్చుకోదగిందని తెలిపారు. అరగంటైనా ఓపిగ్గా ప్రజలు క్యూలో నిల్చొని ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులు ఎంతో క్రమశిక్షణతో బస్సులు ఎక్కే విధానం ప్రశంసనీయమని, ముంబయిలో మాదిరిగా ఎంతో క్రమబద్ధమైన రవాణా వసతులను హైదరాబాదులో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ముంబయిలో ట్రాఫిక్‌ నిర్వహణ ఎంతో సజావుగా సాగుతోందన్నారు. బస్‌స్టాపుల్లో క్యూ విధానం బాగుందన్నారు. ఈ విధానం హైదరాబాద్‌లో అమలు చేయడానికి బస్సు షెల్టర్లలో మార్పులు చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందంలో రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ మిశ్రా, రవాణా శాఖ కార్యదర్శి జగదీశ్వరరావు, నగర పోలీసు కమిషనర్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌ జితేందర్‌, అదనపు కమిషనర్‌ అవినాష్‌ మహంతి, హైదరాబాద్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జాయింట్‌ కమిషనర్‌ టి.రఘునాథ్‌ ఉన్నారు.