తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి

5A5

సింగిల్‌విండో క్లియరెన్స్‌ బిజినెస్‌ మీట్‌లో కేసీఆర్‌ హామీ

కౌలాలంపూర్‌, ఆగస్టు 21 (జనంసాక్షి) : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలిరావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. గురువారం సింగపూర్‌ ఇన్వెస్టర్లతో జరిగిన బిజినెస్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి అవినీతిరహిత వాతావారణంలో ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని పెట్టుబడిదారులకు ఆయన భరోసా ఇచ్చారు. తాము సింగిల్‌ విండో ద్వారా పెట్టుబడులకు క్లీయరెన్స్‌ ఇచ్చే విధానం అమలు చేయబోతున్నామని అన్నారు. పూర్తిస్థాయి రక్షణ, భద్రతా ఏర్పాట్లతో అవినితీరహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని హావిూఇచ్చారు. తెలంగాణలోని ఐటీ రంగంలో విస్తృత స్థాయిలో అవకాశాలున్నాయని కేసీఆర్‌ అన్నారు. ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటో మొబైల్‌ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్‌ తెలిపారు. ఇన్వెస్టర్ల ప్రతిపాదనలకు ఆలస్యం జరగకుండా ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఆమోదం తెలిపే విధంగా యంత్రాంగాన్ని రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. పరిశ్రమలకు పూర్తిస్థాయి విద్యుత్‌ను అందించే విధంగా రానున్న ఆరేళ్లలో 8వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తికి ప్రభుత్వం కృషిచేస్తోందని కేసీఆర్‌ తెలిపారు. సీఐఐ, గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ, సింగపూర్‌ ఇండియన్‌ హైకమిషన్‌ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్‌ జరిగింది. ఈ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై సదస్సులో చర్చించారు. ఇదిలావుంటే సింగపూర్‌ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన బహుమతి లభించింది. కొందరు ఔత్సాహికులు కేసీఆర్‌ బొమ్మతో ఉన్న హాలోగ్రాఫిక్స్‌ ఫ్రేంను ఆయనకు బహూకరించారు. ఎటువైపు నుంచి చూసినా కేసీఆర్‌ కనిపించడం ఈ ఫ్రేం ప్రత్యేకత. బ్రాండ్‌ తెలంగాణ పేరుతో సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటైన బిజినెస్‌ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో కేసీఆర్‌ బొమ్మతో ఉన్న హాలో గ్రాఫిక్స్‌ ఫ్రేం ఆకర్షణగా నిలిచింది.