సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపు పూర్తి
తెలంగాణకే రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ
పీఎస్‌ఆర్ ఆంజనేయులు కూడా టి.ఎస్‌కే
29వరకు అభ్యంతరాలు తెలపండి
ప్రత్యూష సిన్హా కమిటీ
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్రకు సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపు శుక్రవారం పూర్తయింది. రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మను తెలంగాణకు కేటాయించారు. అయితే ఈ కేటాయింపులపై అభ్యంతరాలను ఈ నెల 29వరకు తెలపాలని ప్రత్యూషసిన్హా కమిటీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఎటు వెళ్తారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆయనను తెలంగాణకే కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వారిలో సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ సహా చాలా మంది తెలంగాణకే వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ కూడా తెలంగాణకే రావడం విశేషం. శుక్రవారం కేంద్ర ¬ం శాఖ కార్యాలయంలో సమావేశమైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సివిల్ సర్వేంట్ల పంపిణీపై కసరత్తు పూర్తిచేసింది. తెలంగాణకు 163, ఏపీకి 211 మందికి ఐఏఎస్ అధికారులను కేటాయించింది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా రోస్టర్ విధానంలో పంపకాలు చేపట్టింది. 13:10 నిష్పత్తిలో రెండు రాష్టాల్రకు కేడర్ అధికారుల విభజనను పూర్తిచేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, స్మితా సబర్వాల్, అజయ్ మిశ్రా, రాహుల్ బొజ్జా, సంజయ్‌కుమార్, అనిల్ సింఘాల్, వీనాఈష్, ఏకే ఫరీదాలను రోస్టర్ పద్ధతిలో కమిటీ తెలంగాణకు కేటాయించింది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎంజీ గోపాల్, రాజేశ్వర్ తివారీ, జీఎస్ ప్రసాద్, శాంతికుమారి కూడా తెలంగాణకే వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, అజయ్ జైన్, ఎన్‌ఎన్‌వీ మహంతి, శ్వేత తదితరులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ప్రస్తుతానికి ఐఏఎస్ అధికారుల కేటాయింపు పూర్తయింది. ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజన జరుగుతోంది. అది పూర్తయిన తర్వాత తుది జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.