నేటి నుంచి కాంగ్రెస్‌ ప్లీనరీ

1
హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్‌సింగ్‌

రంగారెడ్డి, ఆగస్ట్‌ 23 (జనంసాక్షి) : నేటి నుంచి రెండు రోజుల పాటు  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈమేరకు శనివారం కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం సవిూపంలోని శేరిగూడ శ్రీ ఇందూ ఇంజినీరింగ్‌ కళాశాలలో కార్యక్రమం జరుగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి గల కారణాలతోపాటు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చిస్తారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ప్లీనరీ ఏర్పాటుచేశారు. ప్రధానంగా ఇటీవల ఎన్నికల్లో ఓటమికి కారణాలను చర్చించనున్నట్లు నాయకులు  తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 2500 మందికిపైగా కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడుతుందని, తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే నిలదీస్తుందని జిల్లా నేతలు అన్నారు. ప్లీనరీ సమావేశాలకు రాహుల్‌ గాంధీతోపాటు జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపినా అలాంటి అవకాశాలు కనిపించడంలేదు. కాంగ్రెస్‌ పార్టీకి వందేళ్లకుపైగా చరిత్ర ఉందని, ఎన్నో జయాపజయాలను ఎదుర్కొంటూ వచ్చిందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లోలో నిర్వహించనున్న ఏర్పాట్లను ఆయన రెండు రోజలు ముందే పర్యవేక్షించారు.

తాజావార్తలు