రైతులే తొలి ప్రాధాన్యత

3

నిరాశ, ఆత్మహత్యలొద్దు

రైతులకు మంత్రి హరీశ్‌ భరోసా

హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : అన్నదాతలకే తమ ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత ఉంటుందని నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. శనివారం సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులు నిరాశ చెందకుండా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. రానున్న సీజన్‌లో రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విషయంలో వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు, మార్కెట్‌ కమిటీ కార్యదర్శులు ప్రభుత్వ కొనుగలో సంస్థలతో సంప్రదింపులు జరిపి, ఏ ఒక్క రైతు తాను పండించిన పంటకు కనీస మద్దతు ధర విషయంలో నిరాశపడకుండా చూడాలని అన్నారు. అవసరమైనప్పుడు టార్పలీన్లు, ప్యాడీక్లీనర్లు, తేమ కొలిచేయంత్రాలు తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలన్నారు. యార్డులో చిన్నచిన్న నిర్వహణ పనులకుగానూ ముందుగా 11.00 కోట్ల రూపాయలను శాఖాపరంగా మంజూరుచేస్తున్నామనీ, ప్రతి మార్కెట్‌ యార్డులో కనీస అవసరాలు అనగా మంచినీటి వసతి, మరుగుదొడ్లు, రైతు విశ్రాంతి భవనాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. మార్కెట్‌యార్డులో గోదాముల సామర్థ్యాన్ని పెంచాలనీ, రైతు బంధు పథకం వినియోగించుకునేలా రైతులకు కరపత్రాలు పంచడం ద్వారా, మార్కెట్‌ యార్డుల్లో బ్యానర్లు ఏర్పాటుచేయడం ద్వారా అవగాహన కల్పించాలనీ, మార్కెట్‌ యార్డులపై సీజన్‌లో వత్తిడి తగ్గించడానికి సంబంధిత జిల్లా కలెక్టర్లు, డిఆర్‌డిఎ పీడీ అధికారులతో సంప్రదించి వీలైనన్నీ ఐకెపీ/పిఎసిఎస్‌ కేంద్రాలను ఏర్పాటుచేసేలా చూడాలని ఆదేశించారు. మార్కెట్‌యార్డుల్లో సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులతో, వ్యాపారులతో, హమాలీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసుకొని మార్కెట్‌ సజావుగా జరగడానికి తగు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రతి మార్కెట్‌ యార్డులో ప్రహరీ చుట్టు మరియు ఖాళీగా ఉన్న ప్రదేశంలో మొక్కలను పెంచాలని తెలిపారు.

రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఒక హెల్ప్‌లైన్‌ని కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు. కరువు కాలంలో రైతులకు అందాల్సిన వ్యవసాయ ఇన్‌పుట్‌ సబ్సిడీని వెంటనే అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందులో భాగంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల పునరుద్ధరణ పనులను తక్షణమే ప్రారంభించడానికి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగరరావు, సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె.జోషి, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్‌, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, మైనర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.