ఐఎన్‌ఎస్ కమోర్తా జాతికి అంకితం
స్వదేశీ పరిజ్ఞానంతో ఇక ఆయుధాల తయారీ
కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ
విశాఖపట్నం, ఆగస్టు 23 (జనంసాక్షి) : స్వదేశీ పరిజ్ఞానంతో పెద్దపీట వేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. శనివారం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో జలాంతర్గమి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ కమోర్తాను జైట్లీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేసి దేశీయ సంస్థలతోనే యుద్ధ నౌక నిర్మాణాలు, ఆయుధాల తయారీని ప్రోత్సహిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కమోర్తాను రూపొందించడం ప్రశంసనీయమన్నారు. రానున్న కాలంలో వంద శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. పాకిస్తాన్ దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పికొడతామని జైట్లీ చెప్పారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం వాస్తవమేనని తెలిపారు. పాక్ ఆగడాలను బీఎస్‌ఎఫ్, ఆర్మీ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని వివరించారు. కోక్ ద్వీపంలో చైనా సరిహద్దు దాటి వచ్చిన విషయం వాస్తవమైనా దానిని పొరపాటుగా పరిగణించలేమని తెలిపారు. దేశ రక్షణ విషయంలో భారత బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడించారు. భారీ విధ్వంసక నౌక శత్రదేశాల జలాంతర్గాములను విధ్వంసం చేసే యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కమోర్తా తూర్పు నౌకాదళం అమ్ముల పొదిలో చేరింది. 13 విూటర్ల భీమ్‌ను కలిగి ఉండే కమోర్త నౌక 110 విూటర్ల పొడవు ఉంటుంది. 25 నాటికన్ మైళ్ల వేగంతో దూసుకుపోయే ఈ నౌక 3500నాటికన్ మైళ్లపాటు నిరంతర పయనం సాగించగలదు. పూర్తి ఆయుధ సామగ్రిని కలిగి సెన్సార్‌ల పరిజ్ఞానంతో అత్యంత ఆధునికతను సంతరించుకుంది. భారీ టోర్పడేలు, ఏఎస్‌డబ్ల్యూ రాకెట్స్, మధ్యంతర స్థాయి గన్, మరో రెండు మల్టీ బారన్ గన్‌లు ఈ యుద్ధ నౌక సాధన సంపత్తి. 20 కిలోవిూటర్ల దూరంలోని టార్గెట్లను సైతం ఇది గుర్తించగలదు.