ప్రశాంతంగా సివిల్స్‌ ప్రిలిమినరీ

2

హైదరాబాద్‌, ఆగస్టు 24(జనంసాక్షి) : సివిల్స్‌ ఫిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సి) నిర్వహించే ఈ పరీక్షకు హైదరాబాద్‌లో 83 కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఉదయం 9.30 నుండి 11.30వరకు పేపర్‌-1 మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు పేపర్‌-2ను నిర్వహించారు. పరీక్షరాసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసి 240 ప్రత్యేక బస్సులను నడిపింది. పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 83 సెంటర్లలో నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని హైదరాబాద్‌ కలెక్టర్‌ ముఖేష్‌ కుమార్‌ విూనా తెలిపారు. ఉదయం నిర్వహించిన పేపర్‌ -1 పరీక్ష నిర్వహణను ఆయన నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా కళాశాల కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో మొత్తం 38,650 అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా మొదటి పేపర్‌కు 18,377 అభ్యర్థులు హాజరవగా, మధ్యాహ్నం నిర్వహించిన 2వ పేపరుకు 18,161 అభ్యర్థులు హాజరయినట్లు కలెక్టర్‌ తెలిపారు. మొదటి పేపరుకు 20,273 మంది, 2వ పేపరుకు 20,489 మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తం అభ్యర్థులలో సరాసరి 47శాతం అభ్యర్థులు పరీక్షలు రాశారని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి.