షరీఫ్‌ గద్దె దిగేవరకు పోరాటం

4

నూతన పాకిస్తాన్‌లోనే నా పెళ్లి

పాకిస్తాన్‌ తెహ్రిక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : షరీఫ్‌ గద్దె దిగేవరకు పోరాటం కొనసాగుతుందని మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రిక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టంచేశారు.  ‘నూతన పాకిస్తాన్‌’ అనే తన స్వప్నం నెరవేరిన తరువాతే వివాహం చేసుకుంటానని ఇమ్రాన్‌ అన్నారు. పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజీనామా చేయాలంటూ వేలాది మద్దతుదారులతో ఇమ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘ఒక నూతన పాకిస్తాన్‌ను రూపొందించాలనుకుంటోంది కేవలం విూ కోసమే కాదు. నా కోసం కూడా. ఆ స్వప్నం నెరవేరగానే నేను పెళ్లి చేసుకుంటాను’ అని పార్లమెంటు భవనం ఎదుట మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 62ఏళ్ల ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌ కేసు విచారణ జరుగుతున్నందున్న పదవి నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్‌ సూచించారు. షరీఫ్‌ రాజీనామాపై ప్రభుత్వంతో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ మూడో దఫా జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొందని ఓ ప్రతిక కథనాన్ని వెల్లడించింది. షరీఫ్‌ రాజీనామా సమర్పించి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్‌ అన్నారు. 1995లో బ్రిటన్‌కు చెందిన జెవిూమా గోల్డ్‌స్మిత్‌ను ఇమ్రాన్‌ఖాన్‌ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగాక, 2004లో పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు.