తెలంగాణ ఇచ్చాం.. అయినా ఓడిపోయాం

5

ఓటమికి కారణాలు, భవిష్యత్‌ కార్యాచరణ విశ్లేషించుకోవాలి

కార్పొరేషన్‌ ఎన్నికల్లో పాగా వేయాలి

శ్రేణులకు దిగ్విజయ్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎన్నికల్లో ఓడిపోయామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఓటమికి కారణాలు, భవిష్యత్‌ కార్యాచరణ విశ్లేషించుకోవాలని ఆయన సూచించారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో పాగా వేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ధృఢ సంకల్పంవల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఆమె నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదికాదని చెప్పారు. ఆమె సంకల్పాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో విఫలమయ్యామని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓటమికిగల కారణాలు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పటిష్టత కోసం ఇబ్రహీంపట్నంలో రెండు రోజుల పాటు జరుగుతున్న మేధోమథన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గెలుపోటములు సహజమమేనని, ఓటమితో కృంగిపోకుండా వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ గెలుపుకోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పేదే చేస్తుందని, చేసింది చెబుతుందన్నారు. తెలంగాణ కోసం టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టకముందు పోరాటంచేసిందని కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తుచేశారు. సిపిఎం మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీల సమ్మతితోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. జరిగిన దాన్ని మరిచిపోయి తెలంగాణాలో తిరిగి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని నష్టం జరిగిన విషయం వాస్తవమన్నారు. విభజనవల్ల సీమాంధ్రలో ఒక్క సీటు కూడా గెలువలేకపోయామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ నాయకత్వం మరువలేనిదన్నారు. ఆయనవల్లే 2004, 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆయన మరణం ఎంతో దురదృష్టకరమని గత అనుభవాలను గుర్తుచేశారు. మేధోమథనం సదస్సులో దిగ్విజయ్‌ సమక్షంలోనే పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తమను మాట్లాడడానికి అనుమతించాలంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టారు. కాగా, ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారని, సీనియర్ల వల్లే పార్టీ అధికారంలోకి రాకపోవడమే కాకుండా తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కారణమని, వెంటనే అతనిని అధ్యక్ష పదవి నుండి తప్పించాలని నినాదాలు చేస్తూ కార్యక్రమానికి అడ్డుతగిలారు. పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి వారిని ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. దీంతో ఒకింత అసహనానికి గురైన దిగ్విజయ్‌సింగ్‌ కార్యకర్తల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నంచేస్తే కఠిన చర్యలు తప్పవని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించడంతో కార్యకర్తలు వెనక్కుతగ్గారు. మెదక్‌ ఉపఎన్నికల్లో సొంతంగానే పోటీ చేద్దామని దిగ్విజయ్‌ సింగ్‌ నేతలకు సూచించారు. ఈ సదస్సులో పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సర్వే సత్యనారాయణ, వి.హనుమంతరావు, గీతారెడ్డి, దానం నాగేందర్‌, సునీతా లక్ష్మారెడ్డి, సురేష్‌రెడ్డి, వంశీచంద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు నేతలు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సదస్సునుద్దేశించి స్వాగతోపన్యాసం చేశారు.