దేవాలయంలో తొక్కిసలాట

1

10మంది మృతి, 60మందికి గాయాలు

భోపాల్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో 10మంది మృతిచెందారు. మరో 60మందికి గాయాలయ్యాయి. ఈ విషాదం మధ్యప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది. సాత్నా జిల్లా చిత్రకూట్‌లోని కంఠానాథ్‌ ఆలయంలో సోమవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. విద్యుత్‌ తీగ తెగిపడిందనే వదంతుతో ఆలయంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో తొక్కిసలాట జరిగి 10 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. సోమవారం అమావాస్య సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమావాస్య సందర్భంగా నిర్వహించే ‘పరిక్రమ’ కార్యక్రమం కోసం పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులను నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే, వదంతులు చెలరేగడంతో భక్తులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో తోపులాట జరిగి చాలామంది కిందపడిపోయారు. వారి పైనుంచి పరుగెత్తకుంటూ వెళ్లడంతో ఊపిరాడక పది మంది కన్నుమూశారు. మరో 60 మంది వరకు గాయపడ్డారు. విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన సహాయక కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని సవిూపంలోని ఆస్పత్రులకు తరలించారు. సమాచారం రాగానే 30 మంది బృందాలను ఘటనా స్థలానికి తరలించి  సహాయక కార్యక్రమాలు చేపట్టామని ఐజీ పవాన్‌ శ్రీవాస్తవ తెలిపారు. కంఠానాథ్‌ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేల పరిహారం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో గతేడాది అక్టోబర్‌లో రంగనాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 115మంది యాత్రికులు దుర్మరణం చెందగా, వంద మందికిపైగా గాయపడ్డారు.