చెమటోడ్చండి.. విజయం సాధించండి

2

మోడీ హవా తగ్గుతోంది

బలమైన ప్రతిపక్షంగా పనిచేయండి

దిగ్విజయ్‌సింగ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : మెదక్‌ ఎంపీ సీటు గెలుపు కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా చెమటోడ్చి కష్టపడాలని ఆ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌  దిగ్విజయ్‌సింగ్‌ సూచించారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా పనిచేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందూ కాలేజీలో సోమవారం మేధోమథన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్‌ మాట్లాడుతూ త్వరలో జరిగే మెదక్‌ ఉప ఎన్నికలో విజయం సాధించేవిధంగా కృషిచేయాలన్నారు. ఓటమితో బాధపడకుండా కలసి విజయాల కోసం పనిచేయాలన్నారు. తెలంగాణలో  ఛానెళ్ల ప్రసారాలపై నిషేధం విధించడం సరికాదని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. విూడియాకు అండగా ఉంటామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మన దేశంలో ఎవరైనా, ఎక్కడైనా జీవించవచ్చన్నారు. హైదరాబాద్‌లోని ఏపీ ప్రజలకు అండగా ఉంటామని దిగ్విజయ్‌ భరోసా ఇచ్చారు. మోదీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ 11 స్థానాల్లో గెలవగా, బీజేపీ 7 స్థానాల్లో మాత్రమే గెలిచిందన్నారు. భవిష్యత్‌ కార్యాచరణ సదస్సు విజయవంతమైందని, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మెదక్‌లో గెలుపు కోసం పనిచేయాలని దిగ్విజయ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దేశంలో ఎవరైనా, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని ఛానళ్లు నిలిపివేడయం సరికాదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనపట్ల ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. కార్యకర్తలు పార్టీ జెండాను ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహరాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌, పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. సీఎల్పీ నేత జానారెడ్డి ఈ సమావేశంలో పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భవిష్యత్‌ కార్యాచరణపై పీసీసీ చీఫ్‌ పొన్నాల తీర్మానం ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో సీఎం పదవికి పోటీపడేవారు కాంగ్రెస్‌ పీసీసీ పదవికి పోటీపడొద్దని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటుతో టీఆర్‌ఎస్‌కు లాభించిందని తెలిపారు. ప్రచార లోపాలతోనే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలయిందని మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి అభిప్రాయడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి సొంత న్యూస్‌ పేపర్‌, టీవీ ఛానల్‌ ఉండాలని సూచించారు. దీని కోసం కార్యకర్తలంతా రూ.1000 చొప్పున విరాళం ఇవ్వాలని కోరారు. టీపీసీసీలో సోషల్‌ విూడియా సెల్‌ ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్‌ నేతలంతా సోషల్‌ విూడియాను వినియోగించాలని  సురేష్‌రెడ్డి సూచించారు. కాగా, పార్టీ సంస్థాగత పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. ప్రైవేట్‌ రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు పోరాడాలి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు తీరుపై అధ్యయనం కోసం పార్టీలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేయాలని కోరారు.