అర్హతలున్న కాలేజీలను మాత్రమే అనుమతించండి

3

జెఎన్‌టియు హైదరాబాద్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : అర్హతలు ఉన్న కాలేజీలను మాత్రమే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అఫిలియేషన్‌ విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని జేఎన్టీయూ హైదరాబాద్‌కు న్యాయస్థానం సూచించింది. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నిర్వహించిన హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. అర్హత ఉన్న కళాశాలలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని స్పష్టం చేసింది. బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు, సరైన వసతులులేని కళాశాలలకు అనుమతి ఇచ్చేందుకు జేఎన్టీయేహెచ్‌ నిరాకరించింది. సరైన బోధనా సిబ్బంది లేరని, ల్యాబ్‌లు, పరికరాలు లేవని, నిబంధనలు పాటించడం లేదన్న కారణాలతో 174కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో 2014-15 సంవత్సరానికి ఆయా కళాశాలల్లో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హత లేకుండాపోయింది. వాటిని ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కళాశాలల జాబితాలో జేఎన్టీయూహెచ్‌ చేర్చలేదు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కౌన్సెలింగ్‌ జాబితాలో తమ కళాశాలలను చేర్చాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమకు అనుమతి రద్దుచేయడం న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించకుంటే తమ దృష్టికి తీసుకువస్తే తప్పులను సరిదిద్దుకుంటామని, కారణాలు చూపకుండా అనుమతి ఇవ్వకపోడం అన్యాయమని తెలిపారు. మరోవైపు, ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకుంది. నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే ఆయా కళాశాలలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపింది. తాము విద్యార్థులకు బోధనా ఫీజులు చెల్లిస్తున్నామని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టంచేసింది. చాలా కళాశాలల్లో నిపుణులైన బోధనా సిబ్బంది లేరని, ల్యాబ్‌లు, వసతులులేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేందుకు కాలేజీలు ముందుకు వస్తే అనుమతి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. అర్హత ఉన్న కళాశాలలకు అనుమతి ఇవ్వాలని స్పష్టంచేసింది. అనుమతుల విషయంలో ఏఐసీటీఈ ప్రమాణాలను పాటించాలని జేఎన్టీయూకు సూచించింది. అదే సమయంలో కాలేజీ యాజమాన్యాలకు స్పష్టమైన నిర్దేశం చేసింది. కాలేజీల్లో వసతుల కల్పనపై జేఎన్టీయూ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టంచేసింది.