ఉప ఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ

4

సెక్యూలర్‌ కూటమి హవా

6 సెక్యూలర్‌ కూటమి, 4 బిజెపి

కర్నాటకలో కమలానికి చుక్కెదురు

న్యూఢిల్లీ, ఆగస్టు 25 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో సెక్యూలర్‌ కూటమి హవా కొనసాగింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లతో కూడిన కూటమి 6 నియోజకవర్గాల్లో గెలిచింది. కర్నాటకలోనూ కమలం పార్టీకి చుక్కెదురైంది. బీహార్‌లో లాలూ-నితీష్‌ల మ్యాజిక్‌ పనిచేసింది. ఉప ఎన్నికల్లో ఇద్దరు నేతలు సత్తాచాటారు. పది అసెంబ్లీ నియోవజకర్గాలకు ఉప ఎన్నికలు జరగగా 6 స్థానాలను సొంతం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న కమల దళానికి ఉప ఎన్నికలు షాకిచ్చాయి. కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. పది నియోజకవర్గాలకు ఆగస్టు 21న ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీని దెబ్బ కొట్టేందుకు లాలూప్రసాద్‌ యాదవ్‌ బద్దశత్రువైన నితీశ్‌కుమార్‌తోపాటు కాంగ్రెస్‌తో జత కట్టారు. మూడు పార్టీల కూటమి ఏర్పాటువల్ల లాలూ లాభపడ్డారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు శత్రువులగా ఉన్న ఆర్జేడీ-జేడీయూలు చేయిచేయి కలిపి చేరో నాలుగు స్థానాల్లో పోటీ చేశాయి. రెండు చోట్ల కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు. ఫలితాలపై లాలూ సంతృప్తి వ్యక్తంచేశారు. మెగా కూటిమికి మద్దతిచ్చిన బీహార్‌ ప్రజలకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో చేసిన తప్పులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై నితీశ్‌కుమార్‌ హర్షం వ్యక్తంచేశారు. ఫలితాలు సంతృప్తి కలిగించాయని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు రెండు కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మూడుచోట్ల ఉప ఎన్నికలు జరుగగా కాంగ్రెస్‌ రెండుచోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. పార్టీలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయనకు.. తాజా ఫలితాలు నిరాశను మిగిల్చాయి. బళ్లారి గ్రావిూణం, చిక్కోడి-సాదల్గాలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన బలాన్ని మరోసారి నిరూపించుకున్నారు. శికారీపూరలో తన కుమారుడు బీవై రాఘేవంద్రను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. బళ్లారి నుంచి శ్రీరాములు, శికారిపూర్‌ నుంచి యడ్యూరప్ప, చిక్కోడ-సాల్దాల్గా నుంచి ప్రకాశ్‌ హుక్కేరీ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వారు ఎంపీలుగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక మధ్యప్రదేశ్‌ ఫలితాలు మాత్రమే కమలదళానికి కాస్త సాంత్వన చేకూర్చాయి. మూడు స్థానాలు ఉప ఎన్నికలు జరుగగా ఆ పార్టీ ఇక్కడ రెండు సీట్లను గెలుచుకుంది.