బొగ్గు కేటాయింపులన్నీ అక్రమమే

5A

1993 నుంచి గాడితప్పింది

కేటాయింపులన్నీ రద్దు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ, ఆగస్టు 25 (జనంసాక్షి) : బొగ్గు కేటాయింపులన్నీ అక్రమమేనని, 1993నుంచి వ్యవస్థ గాడితప్పిందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నింటినీ రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సంచలన ఆదేశాలు జారీచేసింది. 1993 నుంచి జరిగిన బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో పారదర్శక లోపించిందని, అందుకే వాటన్నింటినీ రద్దుచేస్తున్నట్లు కోర్టు తెలిపింది.  బొగ్గు క్షేత్రాల కేటాయింపులు చట్ట విరుద్ధంగా జరిగాయని, కేటాయింపులపై మరింత విచారణ జరగాలని తేల్చిచెప్పింది. స్క్రీనింగ్‌ కమిటీ కేటాయించిన అన్ని కేటాయింపులు సక్రమంగా పారదర్శకంగాలేవని కోర్టు తెలిపింది. బొగ్గు క్షేత్రాలు ఎలా కేటాయించాలనేది కోర్టు నిర్ణయిస్తుందని న్యాయస్థానం పేర్కొంది. బొగ్గు కేటాయింపుల్లో ఎక్కడా నిర్దేశిత నిబంధనలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా కేటాయింపులు చేయడంపై మండిపడింది. నిబంధనలన్నింటినీ కాలరాస్తూ బొగ్గు కేటాయించారని ఘాటుగా వ్యాఖ్యానించింది. బొగ్గు కేటాయింపులన్నీ చట్ట విరుద్ధమని, ఏకపక్ష నిర్ణయాలని విమర్శించింది. కోల్‌గేట్‌ కుంభకోణంపై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం గత జనవరిలో తీర్పును రిజర్వ్‌ చేసింది. సోమవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం భారీ పెట్టుబడులు పెట్టిన అల్టా మెగా కంపెనీల లైసెన్సులు రద్దు చేయలేమని పేర్కొంది. అయితే ఆయా సంస్థలు ఎందుకోసం బొగ్గు వినియోగించేది స్పష్టంచేయాలని సూచించింది. గతంలో బొగ్గు కేటాయింపులన్నీ స్క్రీనింగ్‌ కమిటీ నిబంధనల మేరకు జరిగాయని, అవి చట్ట విరుద్ధమని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు అక్రమమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బొగ్గు బ్లాక్‌ కేటాయింపుల్లో మార్గదర్శక సూత్రాలు ఉల్లంఘించారని స్పష్టంచేసింది. మొత్తం 218బొగ్గు బ్లాక్‌ కేటాయింపులను రద్దు చేయాలా.. వద్దా? అనే విషయాన్ని నిర్ధారించడానికి మరింత విచారణ అవసరమని పేర్కొంది. బొగ్గు కేటాయింపుల అక్రమాలపై పరిణామాలను నిర్ణయించడానికి కోర్టు సెప్టెంబర్‌ 1 వరకు గడువు ఇచ్చింది. 40బొగ్గు కేటాయింపులను రద్దుచేశామని ప్రభుత్వం పేర్కొనగా అందులో 29 ప్రైవేట్‌ కంపెనీలకు ఇవ్వాలని కోర్టు సూచించింది.