పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ, జోషీ ఔట్
అమిత్‌షా మార్కు రాజకీయం
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి) : బిజెపి పార్లమెంటరీ బోర్డు నుంచి ఎల్.కె.అద్వానీ, మురళిమనోహర్ జోషిని తొలగించారు. బీజేపీలో అధికార మార్పిడి సర్వం సంపూర్ణంగా సాగింది. కీలక పరిణామాలకు తెరతీసారు. అమిత్‌షా మార్కు రాజకీయం కనిపించింది. సీనియర్లుగా ఉన్నా అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు పార్లీలో ప్రాధాన్యం లేకుండా చేశారు. మోడీ తన చేతుల్లోకి పార్టీని ప్రభుత్వాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వాజ్‌పేయ్, అద్వానీల నుంచి పార్టీని పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. బిజెపి పార్లమెంటరీ బోర్డులో ఎంతోకాలంగా కీలక బాధ్యతలను పోషిస్తున్న ఇద్దరు సీనియర్ నేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు ఉద్వాసన పలికారు. వాజ్‌పేయ్ అనారోగ్యంతో ఇంటికే పరిమితం కావడంతో ఆయన పేరునూ తొలగించారు. దీంతో పార్టీలోనూ, పార్లమెంటరీ బోర్డులోనూ మోడీ ఆధిపత్యం కొనసాగనుంది. సీనియర్లు ఇద్దరూ ఉద్వాసనకు గురికాగా మరో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. ఆపార్టీ సీనియర్ నేతలు ఎల్.కే.అద్వాని, మురళీ మనోహర్ జోషీలను పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగిస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఒక ప్రకటనలో పేర్కొంది. వీరి స్థానంలో శివరాజ్‌సింగ్ చౌహాన్, జేపీ నడ్డాకు చోటు కల్పించింది. బోర్డులో 12మంది సభ్యులను కూడా నియమిందింది. బోర్డు ఛైర్మన్‌గా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బోర్డులో రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, జైట్లీ, అనంతకుమార్ ఉంటారు. ఇదిలావుంటే ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ నియోజకవర్గం వడోదర స్థానానికి బీజేపీ తరపున రంజన్ బెన్ భట్టాను అభ్యర్థిగా ప్రకటించారు. సాధారణ ఎన్నికల్లో వారణాసి, వడోదర స్థానాల నుంచి గెలిచిన మోడీ, వాటిలో వడోదర స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వడోదర స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో బీజేపీ అగ్రనాయకత్వం తాజాగా భట్టా పేరును నిర్ణయించినట్లు సమాచారం.