మా కరెంటు కష్టాలు ‘బాబూ’ నీ వల్లే

3

ఒప్పందం ప్రకారం విద్యుత్‌ ఇవ్వు

కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. ఒప్పందం ప్రకారం విద్యుత్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ప్రభాకర్‌ విూడియాతో మాట్లాడారు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో కరెంటు కష్టాలుతప్పవని తాము ఎన్నికలకు ముందే చెప్పామని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయాన్ని తాము ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టామని గుర్తుచేశారు. అయినా టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలన్నింటినీ తమ ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుందన్నారు. రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాలు వంటి హావిూలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే సహకరించాల్సింది పోయి విమర్శలు చేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని మండిపడ్డారు. అబద్దాలను ప్రచారం చేయడంలో టీడీపీ నేతలను మించినోళ్లు లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాల పాపం చంద్రబాబుది కాదా? అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు ఎన్నో నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. అందుకే రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును విమర్శించే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని తెలిపారు. ఆనాడు విద్యుత్‌ చార్జీలు ఎందుకు పెంచారని నిలదీసిన రైతులను బషీర్‌బాగ్‌లో తుపాకులతో కాల్చి చంపించిన పాపం టీడీపీ అధినేత చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు. నమ్మకాన్ని వమ్ము చేసిన చరిత్ర టీడీపీది అని దుయ్యబట్టారు. కేసీఆర్‌ రెండు తెలుగు రాష్టాల్రు ముందుకెళ్లలని కోరుకుంటుంటే.. చంద్రబాబు తన అనుయాయులతో కేసీఆర్‌పై విమర్శలు చేయించడం ఎంతవరకు సబబని అని నిలదీశారు. టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వంపై విమర్శలు మానుకొని, సహకరించాలని సూచించారు. అదనపు విద్యుత్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమతో కలిసి రావాలని కోరారు. అంతేకానీ అసంబద్ధ ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.