కరువు కాలం
పరిశ్రమలకు పవర్ హాలిడే
వ్యవసాయానికి విద్యుత్ ఇస్తాం
కరెంటు కష్టాలు అధిగమిస్తాం
మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్, ఆగస్టు 26 (జనంసాక్షి) : పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించి వ్యవసాయానికి విద్యుత్ ఇస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించిన ఆయన కేంద్రం నుంచి రాష్ట్ర అవసరాల కోసం 1500 మెగావాట్ల విద్యుత్‌ను కోరతామని వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ఈటెల విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 12 ఏళ్ల్లుగా ఇంత పెద్ద కరువును ఎప్పుడూ చూడలేదని తెలిపారు. మెట్ట పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతిరోజూ కరువుపై సవిూక్ష చేస్తున్నామని, ఏం చేయాలో తోచడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యామ్నయాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చి వ్వయసాయానికి కరెంటు ఇచ్చే ఆలోచన ఉందని చెప్పారు. 2, 3 రోజుల్లో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నామని తెలిపారు. దక్షిణాది గ్రిడ్ నుంచి 15 వేల మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం అందించాలని కోరారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఆదాయం ఎక్కువన్న ప్రచారం వాస్తవంకాదని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం, రాష్టాల్ర సహకారం ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశంలోనే నూతనమైన పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామన్నారు. వీలైనంత త్వరలోనే విద్యుత్ సమస్యను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాల్సి ఉందన్నారు. అలాగే, సౌర, పవన విద్యుత్‌లను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని వివరించారు. చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు సిద్ధమని, కానీ లైన్లు లేకపోవడం వల్ల ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదన్నారు.