మెదక్‌ తెరాస అభ్యర్థిగా ప్రభాకర్‌రెడ్డి

5
నేడు నామినేషన్‌

కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతాలక్ష్మారెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 26, (జనంసాక్షి) : మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఎంపీ అభ్యర్థిపై పార్టీ అభ్యుర్థులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, ప్రభాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. శాసన సభా, పార్లమెంట్‌ స్థానాలకు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీచేసి రెండు స్థానాలు గెలుచుకున్నారు. శాసన సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎన్నిక కావడంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మెదక్‌ నుండి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ వేయనున్నట్టు పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. అభ్యర్థి ఎవరైనా సమిష్టిగా కష్టపడి పనిచేసి అభ్యర్థి  గెలుపుకు కృషిచేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతా : మెదక్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతాలక్ష్మారెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆమె బుధవారం నామినేషన్‌ వేయనున్నారు. సౌమ్యురాలు, వివాదరహితురాలుగా పేరున్న సునీతకే మెదక్‌ లోక్‌సభ టికెట్‌ వస్తుందని ఆ పార్టీ వర్గాలు ముందుగానే భావించాయి. అందుకు అనుగుణంగానే సునీత పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో మెదక్‌ ఎంపీ స్థానంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఆదేశం మేరకు ఆ పార్టీ శ్రేణులు ఎన్నికకు సమాయత్తమవుతున్నాయి.