మూసాయిపేట ప్రమాదంపై రైల్వే నివేదిక
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
హైదరాబాద్, ఆగస్టు 27 (జనంసాక్షి) : మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ విచారణ పూర్తిచేసింది. బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే జరిగిందని రైల్వే పోలీసులు స్పష్టంచేశారు. అయితే, ప్రమాద సమయంలో పాఠశాల బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడలేదని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడలేదని.. రైలు వస్తున్నా వెళ్లిపోవచ్చనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్లాడని పేర్కొన్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మృతిచెందడంతో కేసును మూసివేయనున్నట్లు తెలిపారు. గత నెల 24న మాసాయిపేట రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొట్టడంతో 18మంది చిన్నారులు మృత్యువాత పడగా.. దాదాపు 24 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ప్రమాద ఘటన బస్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివిశ్వాసం వల్లే జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రమాద సమయంలో డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడని వచ్చిన ఆరోపణలు వట్టిదేనని విచారణలో తేల్చారు. డ్రైవర్ సెల్‌ఫోన్ కాల్‌డేటను పరిశీలించామని, ఆరోజు ఉదయం 6.45 గంటలకు చివరి కాల్ నమోదైందని రైల్వే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. పాఠశాల బస్సుకు చెందిన ధ్రువపత్రాలన్నీ కచ్చితంగానే ఉన్నాయని.. ఫిట్‌నెస్ కూడా బాగానే ఉందని తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. రైలు వచ్చే లోపు పట్టాలు దాటవచ్చన్న అతివిశ్వాసంతో డ్రైవర్ ముందుకెళ్లడం వల్లనే ఈ ప్రమాద ఘటన జరిగినట్లు ఆయన వివరించారు. బస్సుప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తయిందని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వరుణ్‌గౌడ్ అనే విద్యార్థి ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. ఆ విద్యార్థి డిశ్చార్జి అయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తుది నివేదిక అందజేస్తామని వివరించారు. బస్సు డ్రైవర్ ప్రమాదంలో మృతి చెందడంతో త్వరలోనే ఈకేసును మూసివేయనున్నట్లు తెలిపారు. కాపలా ఉన్న, లేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.