ఆ కళాశాలలకు అనుమతి వద్దు
హైకోర్టును ఆశ్రయించిన జెఎన్‌టియు
సింగిల్ బెంచ్ తీర్పుపై సవాల్
హైదరాబాద్, ఆగస్టు 27 (జనంసాక్షి) : కనీస వసతులు లేని కళాశాలకు అనుమతి వద్దని జెఎన్‌టియు వివరించింది. అర్హత కలిగిన ఇంజినీరింగ్ కళాశాలలకు కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలన్న హైకోర్టు తీర్పును జేఎన్టీయూ హైదరాబాద్ న్యాయస్థానంలో సవాలు చేసింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బుధవారం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అర్హత ఉన్న కళాశాలలకు కౌన్సెలింగ్‌లో అనుమతి ఇవ్వాలని సోమవారం హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ కోర్టుకు వెళ్లింది. తెలంగాణలో 315 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా 174 కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు జేఎన్టీయూ అనుమతి నిరాకరించింది. బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు, సరైన వసతులు లేని కళాశాలలకు అనుమతి ఇచ్చేందుకు జేఎన్టీయేహెచ్ నిరాకరించింది. సరైన బోధనా సిబ్బందిలేరని, ల్యాబ్‌లు, పరికరాలు లేవని, నిబంధనలు పాటించడం లేదన్న కారణాలతో 174 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో 2014-15 సంవత్సరానికి ఆయా కళాశాలల్లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హత లేకుండాపోయింది. వాటిని ఎంసెట్ కౌన్సెలింగ్ కళాశాలల జాబితాలో జేఎన్టీయూహెచ్ చేర్చలేదు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కౌన్సెలింగ్ జాబితాలో తమ కళాశాలలను చేర్చాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. అర్హత ఉన్న కళాశాలలను ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఫిలియేషన్ విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని జేఎన్టీయూకు సింగిల్ బెంచ్ ధర్మాసనం సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఏఐసీటీఈ నిబంధనల మేరకు తాము 174 కళాశాలలకు అనుమతి నిరాకరించామని తెలిపింది. నాణ్యమైన విద్య అందించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో తప్పేవిూలేదని పిటిషన్‌లో పేర్కొంది. నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఆయా కళాశాలలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపింది. తాము విద్యార్థులకు బోధనా ఫీజులు చెల్లిస్తున్నామని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేసింది. చాలా కళాశాలల్లో నిపుణులైన బోధనా సిబ్బంది లేరని, ల్యాబ్‌లు, వసతులు లేవని తెలిపింది. సింగిల్ బెంచ్ తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని న్యాయస్థానాన్ని కోరింది.