ప్రతిష్టాత్మకంగా జన్‌ధన్‌

5

ప్రతి పౌరునికి రెండు ఖాతాలు

లాంఛనంగా నేడు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోడీ

న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : ప్రతిష్ఠాత్మకంగా చేప్టటిన జన్‌ ధన్‌ యోజన పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి ఒక్కరికీ రెండు ఖాతాలు నినాదంతో దీనిని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇందుకోసం బ్యాంకర్లు ఏర్పాటుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ మేరకు బ్యాంకులు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాటు చేశాయి. భార్యాభర్తలు ఇద్దరూ అకౌంట్‌ కలిగి ఉండాలని నిబంధన విధించారు. దీనిని విజయవంతం చేసేందుకు ఈ స్కీము కింద వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణను రెండు లక్షల వరకు  ప్రభుత్వం పెంచింది. స్కీముకు శ్రీకారం చుట్టే రోజైన  గురువారం నాడే బ్యాంకులు కోటి బ్యాంకు ఖాతాలను ప్రారంభించే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో అన్ని కుటుంబాలకూ బ్యాంకింగ్‌ సేవలు అందించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ‘ప్రధానమంత్రి జన్‌-ధన్‌ యోజన’ కార్యక్రమాన్ని ఈ నెల 28న హైదరాబాద్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) లాంఛనంగా ఆవిష్కరించనుంది. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అన్ని బ్యాంకులు పాలుపంచుకోనున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిదగా హాజరవుతారని ఎస్‌బీహెచ్‌ తెలిపింది. అలాగే రాజమండ్రిలో జరిగే కార్యక్రమంలో ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. అందరికీ బ్యాంకు సేవల అందజేతే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 28న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వేరువేరు ప్రాంతాలలో దాదాపు 76 చోట్ల విస్తృత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాజధానులు, జిల్లా కేంద్రాలలో చేపట్టే కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరు అవుతారు. ఆ సందర్భంగా కొత్త ఖాతాదారులకు రూపయ్‌ డెబిట్‌ కార్డులను రూ. లక్ష బీమా సౌకర్యంతో అందజేయనున్నారు. దేశంలో అన్ని కుటుంబాలకు బ్యాంకుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రతి ఒక్క పరివారంలో ఒకటైనా బ్యాంకు ఖాతా ఉండేటట్లు చూడడం పీఎమ్‌జేడీవై లక్ష్యం. మొదటి వంద రోజుల లోపల బ్యాంకు ఖాతాను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో తెరిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వ పక్షాన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే అదనంగా ఇచ్చే రూ.లక్ష బీమా రక్షణ కోసం ఖాతాదారు 45 రోజుల లోపల కనీసం ఒక లావాదేవీని నిర్వహించాలి. ఈ ప్రతిష్టాత్మక పథకం ముఖ్యోద్దేశం 2018 ఆగస్టు కల్లా 7.5 కోట్ల కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి రెండు బ్యాంకు ఖాతాలు ఉండేలా చూడటమే. పీఎమ్‌జేడీవై స్కీములో.. బీమా రక్షణతో కూడిన రూపయ్‌ డెబిట్‌ కార్డు, ఆధార్‌ సంఖ్యతో ముడిపెట్టిన ఖాతాలకు రూ.5,000 ఓవర్‌డ్రాప్ట్‌ సౌకర్యం లభిస్తాయి. అన్ని బ్యాంకులు తగిన ఏర్పాట్లు చేసుకొంటున్నాయని, 28న మెగా క్యాంపు ఉంటుందని చెప్పారు.