అర్హతలున్న అన్ని కళాశాలలకు కౌన్సెలింగ్‌

1

సింగిల్‌ జడ్జి ధర్మాసనాన్ని సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అర్హతలున్న అన్ని కళాశాలలకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. డివిజన్‌ బెంచ్‌ కూడా సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో అన్ని కశాశాలలు కౌన్సిలింగ్‌కు అర్హత సాధించాయి. సీట్ల పునరుద్ధరణ విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌లో ఇంజినీరింగ్‌ సీట్లను పునరుద్ధరించాలంటూ జేఎన్టీయూహెచ్‌ను ఆదేశించింది. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల సఖ్యను కుదిస్తూ జేఎన్‌టీయూహెచ్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ హైకోర్టు సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పుపై ఆ విశ్వవిద్యాలయం ధర్మాసనం ముందు అప్పీలు దాఖలుచేసింది. ఈ నెల 25న ఇచ్చిన హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పును నిలుపుదల చేయాలని అభ్యర్థించింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం ముందు వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అసలు సీట్ల కేటాయింపు వ్యవహారంలో ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్‌ల మధ్య సమన్వయం కొరవడినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఏఐసీటీఈ నిబంధనలను పాటిస్తామంటూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇంజినీరింగ్‌ కళాశాలలను కూడా హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ముగించింది. దీంతో  ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాళాశాలలకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ద్వారా ఊరట లభించింది. కళాశాలల్లో మౌలిక వసతులు లేని కారణంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా 130కాలేజీలను జేఎన్‌టీయూ నిలువరించింది. దీనిని సవాలు చేస్తూ బాధిత కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన సింగిల్‌ బెంచ్‌ ఈ కాలేజీలను కూడా కౌన్సెలింగ్‌కు అనుమతించాలని తీర్పువెల్లడించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జేఎన్‌టీయూ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌ సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పెంచాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కౌన్సెలింగ్‌లో మరో 130కాలేజీలకు జేఎన్‌టీయూ అనుమతి తెలిపింది. దీంతో తెలంగాణలో అదనంగా 70వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి.