మన సిలబస్‌.. మన ముచ్చట్లు

3

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడాలి

రెండు కమిటీలు ఏర్పాటు

సభ్యులుగా కోదండరాం, చుక్కా రామయ్య,

నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌ ప్రభుతులు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : పాఠశాల విద్యావిధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా కొనసాగుతున్న సిలబస్‌ను మార్చాలని, దాని స్థానంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త పాఠ్య ప్రణాళిక తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే రెండు కమిటీల్లో కోదండరాం, చుక్కా రామయ్య, నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌ ప్రభుతులు సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు తెలుగు, సాంఘిక శాస్త్రం పాఠ్యప్రణాళిక సవిూక్షకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో.. రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం ప్రతిబింబించేలా పాఠ్యపుస్తకాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిపుణులు, అధికారులు, ఉపాధ్యాయులతో రెండు సబ్జెక్టులకు వేరు వేరు కమిటీలను ఏర్పాటుచేసింది. తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర ప్రతిబింబించేలా కొత్త సిలబస్‌ ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలుగు సిలబస్‌ సవిూక్ష కమిటీలో ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ రమాకాంత్‌ అగ్ని¬త్రి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ప్రమఖ కవి, గాయకుడు, సీఎం కార్యాలయంలో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, సుప్రసన్నాచార్య, ప్రొఫెసర్‌ బన్న ఐలయ్య, వేణు సంకోజు, నలిమెల భాస్కర్‌, పల్లేర్ల రామ్మోహన్‌రావు, వి.చెన్నయ్య వంటి 15మంది నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అలాగే, సాంఘిక శాస్త్రం సిలబస్‌ సవిూక్షకు 16మందితో కమిటీని ఏర్పాటుచేసింది. సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక సవిూక్ష కమిటీలో తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ విజయబాబు, ప్రొఫెసర్‌ కైలాష్‌ తదితరులు ఉన్నారు.