పేదరికం నిర్మూలన కోసమే జన్‌ ధన్‌

4

దేశవ్యాప్తంగా ప్రారంభమైన కొత్త పథకం

లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ

న్యూఢిల్లీ, ఆగస్టు 28 (జనంసాక్షి) : పేదరికం నిర్మూలన కోసమే జన్‌ ధన్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రధానంత్రి నరేంద్రమోడీ చెప్పారు. ఈ పథకాన్ని  గురువారం ఢిల్లీలో విజ్ఞాన్‌ భవన్‌లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 76 కేంద్రాల్లో ఒకే రోజున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజు 1.5కోట్ల మందికి బ్యాంక్‌ ఖాతాలు ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభంలో పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. జన్‌ ధన్‌ యోజన పథకం లక్ష్యాలను వివరిస్తూ బ్యాంకు అధికారులకు ప్రధాని మోడీ స్వయంగా ఈ మెయిల్స్‌ పంపారు. 7.25లక్షల ఈమెయిల్స్‌ను ఆయన పంపారు. ఈ ఆధార్‌ అనుసంధాన ఖాతాలకు రూ. 5 వేలు ఓవర్‌ డ్రాప్ట్‌ సౌకర్యం, పేదలకు డెబిట్‌ కార్డు, రూ.లక్ష బీమా సౌకర్యం కల్పించనున్నారు. పేదలకు డెబిట్‌ కార్డులు, రూ.లక్ష వరకు భీమా సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్‌ ఖాతా ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ పథకం పేదవారి జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక ఆర్థిక అవసరాలకు బ్యాంకు ఖాతాలు ఉపయోగపడతాయని మోదీ తెలిపారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా ఉన్నట్టేనని ఆయన అన్నారు. జాతీయ సమగ్రత కోసమే ఈ పథకానికి జన్‌ ధన్‌ యోజన పథకమని పేరు పెట్టినట్లు మోదీ తెలిపారు. ప్రజల్లో నమ్మకం నిలపడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకంచేసి ఈ పథకాన్ని అమలుచేయడం ఇదే తొలిసారని మోదీ వ్యాఖ్యానించారు. ఈ అనుభవంతో ఎన్నో కొత్త మార్గాలకు లక్ష్యం సుగమవుతుందని ఆయన అన్నారు. సమాజాంలో ఇప్పటికే ఆర్థిక ఆస్పృశ్యత నెలకొందని.. దీని నుంచి పేదలకు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అందరికీ బ్యాంక్‌ ఖాతా లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేదలు అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారని, పేదల కష్టాలకు అప్పులే కారణమని మోదీ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం పేదరిక నిర్మూలనకోసమేనని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామరాజన్‌, ఏపీ తరఫున ఎంపీ కంభంపాటి, పలువురు బ్యాంక్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఈ పథకాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. తిరుపతిలో కేంద్రమంత్రి అనంత్‌గీతే, రాజమండ్రిలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు. హైదరాబాద్‌తో సహా పలు పట్టణాల్లో ఖాతాలు ప్రాంభించేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూకట్టారు. దీంతో బ్యాంకుల్లో రద్దీ పెరిగింది. అదనపు సిబ్బంది లేకుండానే ఖాతాలను ప్రారంభించాల్సి రావడంతో బ్యాంకుల్లో లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలిగింది.