బడ్జెట్‌ అంటే జమ, ఖర్చుల పద్దు కాదు

5
ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం కావాలి

సిఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : బడ్జెట్‌ అంటే జమ, ఖర్చుల వ్యవహారంకాదని ప్రభుత్వ కార్యాచరణ రూపకల్పన అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం కావాలని ఆయన ఆకాంక్షించారు. సచివాలయంలో గురువారం ప్రభుత్వ సలహాదారులు, అన్ని శాఖల ముఖ్య అధికారులతో ముఖ్యమంత్రి బడ్జెట్‌ తయారీకి సంబంధించిన విధివిధానాలపై సమీక్ష జరిపారు. ప్రతి శాఖకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులు జరపడం కన్నా ముందే విధానాలు రూపొందించాలని సిఎం చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేవిధంగా, సమాజంలోని అన్ని వర్గాలకు మేలుచేసే విధంగా ఉండాలని, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ తయారుకావాలని సిఎం ఆకాంక్షించారు. బడ్జెట్‌ తయారీ మూస పద్ధతిలో కాకుండా, నూతన ఒరవడిలోసాగాలని చెప్పారు. ముందుగా వివిధ శాఖలకు సంబంధించిన విధానాలను తయారుచేయాలని, తర్వాత వాటిపై క్షుణ్నంగా చర్చ జరపాలని, చివరికి బడ్జెట్‌ కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ విధానాలు కూడా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలికంగా ఉండాలని చెప్పారు. తెలంగాణకు ఉన్న వనరులేంటి? తెలంగాణ ప్రజల అవసరాలేంటి? తెలంగాణ ప్రాధాన్యాలేంటి? అనే అంశాలపై పూర్తిస్తాయిలో అవగాహన ఏర్పాటుచేసుకొని దాని ప్రకారం విధానాలు రూపొందించాలని సూచించారు. ప్రతిరంగంలో ప్రస్తుతమున్న విధానాలు, చట్టాలు ఎలా ఉన్నాయి. వాటిని యథాతథంగా తెలంగాణ కోసం వాడుకోవచ్చా? మార్పులు చేయాలా? పూర్తిగా కొత్త చట్టం తేవాలా? అనే విషయాలపై కూడా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు. మంచినీటి వ్యవస్థ, వ్యవసాయం, పరిశ్రమలు, గ్రీన్‌కవర్‌ తదితర అన్ని విభాగాలలో ప్రస్తుత పరిస్థితి ఏమిటనేది అధ్యయనం చేసి తెలంగాణ కోణంలో ఆయా రంగాలకు విధానాలు తయారు చేయాలన్నారు. బడ్జెట్‌ రూపకల్పనలో పూర్తిస్థాయి సంస్కరణ కనిపించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటివరకు తయారైన బడ్జెట్‌లన్నీ ఆంధ్రప్రదేశ్‌ కోణంలో వున్నాయని, కాని ఇప్పుడు తెలంగాణ దృక్పథంతో బడ్జెట్‌ తయారు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు కార్పోరేషన్లకు కూడా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని ఇందుకు అవసరమైన విధానాలు ,చట్టాలపై ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. బడ్జెట్‌ రూపొందించడంలో భాగంగానే వనరులు సమీకరణ, ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో కూడా సంస్కరణలు తీసుకురావాలని, అక్రమాలను నియంత్రించే విధంగా విధానాలు ,కార్యాచరణ వుండాలని  ముఖ్యమంత్రి చెప్పారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు కేవలం ఒక సంవత్సరం కోసమే చేస్తున్నామని భావన వుండవద్దని, ఐదేళ్ల కాలానికి కార్యాచరణ రూపొందించవచ్చని మొదటి ఏడాది నిధులు కేటాయిస్తున్నామనే విషయాన్ని గమనించాలని ముఖ్యమంత్రి చెప్పారు.బడ్జెట్‌ రూపకల్పన కోసం 14 టాస్క్‌ఫోర్సులను ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కెవి.రమణాచారి, ఎకె.గోయల్‌, రామలక్ష్మణ్‌, విద్యాసాగర్‌రావు, ఎంపీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డిజిపి అనురాగ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.