ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

2

హైదరాబాద్‌/విజయవాడ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ఎంసెట్‌ వైద్య విద్య కౌన్సెలింగ్‌ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఆంధప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉమ్మడిగా ఈ ప్రవేశాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం తెలంగాణ, ఏపీలోని 5 ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. తెలంగాణలో హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎంసెట్‌ మెడికల్‌ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది. కౌన్సిలింగ్‌లో అధికారులు ఈ ఏడాది కొత్త నిబంధనను పొందుపరిచారు. కేటాయించిన సీటు రద్దు చేసుకుంటే సదరు అభ్యర్థి రూ.లక్ష ఫైన్‌ కట్టాలని అధికారులు వెల్లడించారు. కాలేజీల్లో సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు అదేవిధంగా ఇతర అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్న సదుద్ధేశ్యంతోనే ఈ నిబంధనను పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. సీటు తీసుకున్నాక దాన్ని రద్దు చేసుకుంటే లక్ష రూపాయల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో తమ పిల్లలకు మంచి కాలేజీలో సీటు వస్తే దాన్ని మార్చుకోవడం తప్పా అని వారు వాదిస్తున్నారు. అయితే.. కావాలని సీటు రద్దు చేసుకుంటేనే ఫైన్‌ కట్టాల్సి ఉంటుందని  తెలిపారు. మరోవైపు.. ఎంసెట్‌ మెడికల్‌ విభాగంలో 19వ ర్యాంకు వచ్చినా.. కౌన్సెలింగ్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో డీనా అనే ర్యాంకర్ను అధికారులు తిప్పిపంపారు. మరోవైపు విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో కూడా మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఓపెన్‌ కేటగిరీలో 800వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత 801 నుంచి 1500 ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సెప్టెంబరు 2 నుంచి 5వరకు రిజర్వేషన్‌ కేటగిరీలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. రెండు రాష్టాల్ల్రో ప్రస్తుతం 5,950 ఎంబీబీఎస్‌, 2,380 బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాషాల్లో ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో అధికారులు కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. కేటాయించిన సీటును రద్దు చేసుకుంటే రూ.లక్ష చెల్లించాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రవిరాజు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ముందుగా చేరిన 200మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేయనున్నట్లు వీసీ రవిరాజు తెలిపారు. మెడికల్‌ సీట్లలో 15శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వీసీని కలిసి మెమోరాండం ఇచ్చేందుకు పీడీఎస్‌యూ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.