జపాన్‌తో కీలక చర్చలు
క్యోటీ-వారణాసి, స్మార్ట్ వారసత్వ నగరాలు
రక్షణ శాఖ, సివిల్ న్యూక్లియర్ ఒప్పందాలు
జపాన్ చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : జపాన్‌తో భారత్ కీలక చర్చలు చేసింది. క్యోటీ-వారణాసి, స్మార్ట్ వారసత్వ నగరాలుగా ఎంపిక చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అలాగే రక్షణ శాఖ, సివిల్ న్యూక్లియర్ ఒప్పందాలు సైతం జరిగాయి. ఐదు రోజుల పర్యటన నిమిత్తం శనివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్‌కు చేరుకున్నారు. మోడీకి ప్రధాని షింజే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రధానులు వారణాసి- క్యోటో స్మార్ట్ వారసత్వ ఒప్పందంపై సంతకం చేశారు. జపాన్ ప్రధాని షింజో అబే ఇచ్చిన విందుకు మోడీ హాజరయ్యారు. ఈ భేటీలో భారత్, జపాన్ మధ్య స్మార్ట్ వారసత్వ నగరాల ఒప్పందం కుదిరింది. వారణాసి-క్యోటో ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. క్యోటో మాదిరి కాశీని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదిరింది. రక్షణ శాఖ, సివిల్ న్యూక్లియర్ సెక్టార్‌లో ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం. భారత ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలోని అత్యున్నతస్థాయి భారత బృందం జపాన్‌లోని ప్రాచీన నగరమైన క్యోటోతో వారణాసిని సాంస్కృతిక వారధిగా చేసే అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. క్యోటోనే ఎంపిక చేసుకోవడం వెనక బలమైన కారణాలు ఉన్నాయి. జపాన్‌కు సుదీర్ఘకాలంగా రాజధానిగా క్యోటో వుంది. సుమారు వెయ్యేళ్ల చరిత్ర దీని సొంతం మాత్రమే కాకుండా జపాన్‌లోని వారసత్వనగరాల్లో అతిపెద్దదిగా గుర్తింపు పొంది ఉంది. జపాన్ సంస్కృతికి ప్రతిబింబమైన ఈ నగరం స్మార్ట్‌సిటీగా వుండటం గమనార్హం. మన దేశంలో నూరు స్మార్ట్‌సిటీలను అభివృద్ది చేయాలన్న యోచనతో ఉన్న మోడీ క్యోటోను మార్గదర్శకంగా ఎంపికచేసినట్టు తెలుస్తోంది. ప్రాచీన వారసత్వంతో పాటు ఐటీ రంగానికి కూడా కేంద్రంగా ఉంది. ఈ నమూనాలోనే ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిని ప్రాచీనం, ఆధునికత కలయికగా అభివృద్ధి చేయాలన్నదే మోడీ అభిమతమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్ ప్రధాని అబెల సమక్షంలో జరగడం విశేషం. ఇందులో ఇరుదేశాలకు చెందిన ప్రతినిధి బృందం పాల్గొంది.ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ చేరుకున్నారు.ఈ పర్యటనలో రక్షణ, పౌర అణు కార్యక్రమం తదితరరంగాల్లో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మోడీ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రక్షణ, పౌర అణు కార్యక్రమాల్లో కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ యాత్రలో ఆయన జపాన్‌లోని ‘స్మార్ట్ సిటీ’ క్యోటో, రాజధాని టోక్యో సందర్శించనున్నారు.