గుజరాత్ మా ముందు బలాదూర్
మాదే ‘మహా’ అభివృద్ధి
మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్
ముంబై, ఆగస్టు 31 (జనంసాక్షి) : తమ రాష్ట్రంలోనే ‘మహా’ అభివృద్ధి జరిగిందని, గుజరాత్ తమ ముందు బలాదూర్ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ అనుసరించిన గుజరాత్ అభివృద్ధి నమూనా గురించి చర్చ జరుగుతుండడం తెలిసిందే. చవాన్ మాత్రం ఈ విధానంతో ఒరిగేదీ ఏవిూలేదన్నారు. అన్ని రంగాల్లో ఆ రాష్ట్రం కంటే తాము ముందంజలో ఉన్నామని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంచేశారు. గత 15ఏళ్లలో తమ ప్రభుత్వం మహారాష్ట్రను గుజరాత్ కంటే ఎక్కువే అభివృద్ధి చేసిందని స్పష్టంచేశారు. ‘ప్రతి రంగంలోనూ మేం గుజరాత్ కంటే ముందే ఉన్నాం. మోడీ చేసింది.. మేం చేయనిది ఏంటి ? ఉద్యానవనాలు, పారిశ్రామికీకరణ, విద్య, వైద్యం.. ఇలా అన్నిరంగాల్లో మేం పురోగతి సాధించాం. మాది పూర్తిగా పరిశ్రమల అనుకూల విధానం. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తుల్లో 18.4శాతం మా రాష్ట్రం నుంచే వస్తున్నాయి. స్థూల దేశీయ ఉత్పత్తిలోనూ మా వాటా 14.09 శాతం. మా రాష్ట్రానికి రూ.14,73,466 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తే గుజరాత్‌కు వచ్చిన వాటి విలువ రూ.13,98,347కోట్లు మాత్రమే. పోషకాహార లోపాలను నివారించేందుకు మేం చేసిన కృషిని యూనిసెఫ్ కూడా ప్రశంసించింది. చిన్నారుల్లో ఎదుగుల లోపాలను కూడా చాలా వరకు అరికట్టగలిగాం. ఇక నుంచి పారిశ్రామిక కేంద్రాలు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తాం. 10, 12వ తరగతుల విద్యార్థులకు నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రైవేటు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఫలితంగా వ్యవ సాయరంగంలోకి ఆధునిక పరిజ్ఞానం ప్రవేశించి మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలియజేసేందుకు మేం ప్రత్యేకంగా ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తాం. మోడీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. మాది వ్యక్తిగత ప్రచారం కాదు. సమిష్టిగా ప్రజాప్రయోజనం కోసం దీనిని నిర్వహిస్తున్నాం’ అని వివరించారు.
ఈసారి కూడా గెలుపు మాదే..
ముఖ్యమంత్రి, పార్టీ వేర్వేరు కాదని, పార్టీ గెలిస్తే నాయకులు, కార్యకర్తలంతా గెలిచినట్టేనని చవాన్ స్పష్టంచేశారు. ప్రజల్లో తనపై సానుకూల అభిప్రాయం ఉంటే, అది ఎన్నికల్లో బయటపడుతుందన్నారు. ‘ప్రజలు నన్ను మరోసారి సీఎంగా కోరుకుంటే ఓట్లు వేస్తారు. యూపీఏ-2 ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోవడంతో దానికి పరాభవం తప్పలేదు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మేం పరాజయం పాలయ్యాం. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిం చడం ద్వారా ఈ వైఫల్యాన్ని అధిగమిస్తాం. అధికార వ్యతిరేకత మాకు సమస్యే కాదు. మా ప్రభుత్వం ఏం చేసిందనేదే ప్రజలకు ముఖ్యం’ అని అన్నారు. ఎన్నికల కోసమే మరాఠాలు, ముస్లింలకు విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్న విమర్శలకు బదులిస్తూ ఈ వర్గాల వెనుకబాటుతనంపై అన్ని రకాల అధ్యయనాలు పూర్తిచేసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు.
ఎన్సీపీని మా కార్యకర్తలు నమ్మడంలేదు
కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మహారాష్ట్రను గత 15ఏళ్లుగా ఏలుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని ఎన్సీపీ పట్టుబట్టడంతో ఇరు పక్షా ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీట్ల పంపకాలపై చర్చలు స్తంభించాయి. ఎన్సీపీ వైఖరిపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్సీపీ చర్యలన్నీ కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నట్టు తమ కార్యకర్తలు భావిస్తున్నారని చవాన్ చెబుతున్నారు. అయితే ఈసారి కూడా ఎన్సీపీతో కలసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ‘కాంగ్రెస్‌ను ఓడించాలని ఎన్సీపీ పలుసార్లు స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపింది. అందుకే మా కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది’ అని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 288అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ తమకు 144 కేటాయించాల్సిందేనని ఎన్సీపీ అగ్రనాయకుడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ కాంగ్రెస్ కంటే రెండు ఎక్కువ సీట్లు సాధించడంతో పవార్‌తోపాటు మరికొంద రు నాయకులు ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. లేకుంటే ఒంటరిగానే పోటీచేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై చవాన్ స్పందిస్తూ ‘అధిష్టానం సూచన మేరకు సీట్ల సర్దుబాటు గురించి నేను చాలాసార్లు ఎన్సీపీ వాళ్లతో మాట్లాడాను. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. ఇవి నాతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి పరీక్ష వంటివి. ఈసారి బీజేపీ ఓడిపోతే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయం పాలపొంగు వంటిదని ప్రజలు భావించే పరిస్థితి వస్తుంది’ అని పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.