కామ్రెడ్స్‌ కలిసి పనిచేద్దాం రండి : మమత

2

కుదరదు : లెఫ్ట్‌

కోల్‌కతా, ఆగస్టు 31 (జనంసాక్షి) : కామ్రెడ్స్‌తో కలిసి పనిచేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ స్నేహాస్తం అందిస్తున్నారు. మమతతో కలిసి పనిచేయడం కుదరదని వామపక్షాలు తెగేసి చెబుతున్నాయి. లాలూ ప్రసాద్‌, నితీష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ దోస్తీ ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికలలో వర్కవుట్‌ కావడంతో ఇదే మార్గంలో వెళ్తే మంచిదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హవాను అడ్డుకునేందుకు పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు మమత ప్రకటించడం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, వామపక్ష పార్టీల నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. బీజేపీకి, మోడీకి చెక్‌ పెట్టేందుకు ఇప్పటికే బీహార్‌లో కాంగ్రెస్‌, జెడీయు, ఆర్జేడీ చేతులు కలిపాయి. యూపీలో బీఎస్పీతో చేతులుకలిపేందుకు ఎస్పీ మొగ్గుచూపినా మాయావతి నో చెప్పారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ముప్పయ్యేళ్లుగా కమ్యూనిస్టుల పైన పోరాడిన మమతా బెనర్జీ కూడా వారితో పొత్తు కోసం సిద్ధమంటున్నారు. ఇదంతా మోడీ మాయేనని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాల్లోనూ.. ప్రజాస్వామ్యంలోనూ ఎవరూ అంటరానివారు కాదనీ, సీపీఎంతో పొత్తుకు తాము కూడా వ్యతిరేకంకాదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాము అన్ని తలుపులు తెరిచి ఉంచుకుంటామని, అవకాశం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. పొత్తుకు సంబంధించి సీపీఎం నుంచి ప్రతిపాదన వస్తే దానిని పార్టీలో చర్చిస్తామని, తమ పార్టీలో వివిధ స్థాయులు ఉన్నాయని, వాటిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ప్రతిపాదనలను లెఫ్ట్‌ నేతలు తిరస్కరించారు.