పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
అల్లర్లలో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
చర్చలకు సిద్ధం : పాక్ సర్కార్
ఇస్లామాబాద్, ఆగస్టు 31 (జనంసాక్షి) : పాకిస్తాన్‌లో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. అల్లర్లలో ఇద్దరు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆందోళనకారులతో చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. శనివారం రాత్రి, ఆదివారం పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పెద్దఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ందలాది గాయపడ్డారు. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా కోరుతూ ఆగస్టు 15నుంచి ఇమ్రాన్‌ఖాన్, తాహిర్ అల్ ఖాద్రీలు పార్లమెంటు బయటే బస చేసి ఉన్నారు. దాంతో వారి అనుచరులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రధాని నివాసం వద్దకు దూసుకుపోయే ప్రయత్నం చేసిన ఆందోళనకారులను భద్రతాసిబ్బంది బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్ల ప్రయోగంతో నిలువరించేందుకు యత్నిస్తున్నారు. ఆందోళనకారులే హింసాత్మక ప్రవర్తనకు పాల్పడుతున్నారని, భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాలైన ప్రభుత్వ భవనాల్లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆందోళనకారులు తుపాకీ చూపి తమ డిమాండ్లను సాధించుకోవాలనుకుంటున్నారు కానీ, తాము మాత్రం శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది.