మందిరాలను వీక్షించి ముగ్దుడైన మోడీ
భారతదేశ బౌద్ధ విహార కేంద్రాలతో కలిసి పనిచేద్దాం
ఆదివాసులను పీడిస్తున్న సిక్కిల్‌సెల్ ఎనీమియాకు మందు కనిపెట్టండి
జపాన్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ బిజీబిజీ
టోక్యో, ఆగస్టు 31 (జనంసాక్షి) : జపాన్‌లో మందిరాలను చూసి ప్రధాని నరేంద్రమోడీ ముగ్దుడయ్యాడు. భారతదేశ బౌద్ధ విహార కేంద్రాలతో కలిసి పనిచేద్దామని ఆయన కోరారు. ఆదివాసులను పీడిస్తున్న సిక్కిల్‌సెల్ ఎనీమియాకు మందు కనిపెట్టాలని అన్నారు. జపాన్ దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి ఆదివారం టోక్యోలో బిజిబిజీగా గడిపారు. నగరంలోని పలు బౌద్ధ దేవాలయాలను సందర్శించారు. అక్కడి ప్రధాన గురువులతో సమయం కేటాయించి గడిపారు. ఈ సందర్భంగా మోడీ 57మీటర్లు ఎత్తున్న తోజి ఆలయాన్ని సందర్శించారు. ఆయా మందిరాల వద్ద ప్రజలతో తాను మోడీని అంటూ పరిచయం చేసుకుని ఉల్లాసంగా గడిపారు. భారతదేశంలోని బౌద్ధ విహార కేంద్రాలతో కలిసి పనిచేయాల్సిందిగా మందిరాల నిర్వాహకులను కోరారు. అనంతరం టోక్యో విశ్వవిద్యాలయంలో టెన్‌సెల్ పరిశోధనా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. భారతీయ గిరిజనులను పీడిస్తున్న సికిల్‌సెల్ ఎనిమియా వ్యాధి పరిష్కారం కనుగొనాలని అక్కడి శాస్త్రవేత్తలను కోరారు. అనంతరం టోక్యో బుద్ధిస్ట్ అసోసియేషన్ మోడీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అనంతరం టోక్యో మేయర్లతో సమావేశమయ్యారు. మోడీని కలిసేందుకు జపాన్ ప్రధాని సిమ్‌జో అబే ప్రత్యేకంగా టోక్యోకు వచ్చారు. ఆయనను కలిసిన మోడీ జపాన్ భాషలోకి అనువదించిన భగవద్గీత, వివేకానంద పుస్తకాలను బహూకరించారు. మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త అధ్యయానికి తెరదీస్తుందన్న ఆశాభావాన్ని జపాన్ ప్రధాని వ్యక్తంచేశారు. ఐదు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా భారత్-జపాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రాచీన కట్టడాలను, సంస్కృతిని పరిరక్షించే స్మార్ట్ సిటీలను తెచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే మౌలిక సదుపాయాలు, వాణిజ్య, రక్షణ, అణ్వస్త్రాలకు సంబంధించిన పలు ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరే అవకాశాలు ఉన్నాయి. బుల్లెట్ రైలుకు సంబంధించిన ప్రాజెక్టు కూడా మోడీ పర్యటనలో చర్చకు రానున్నట్లు సమాచారం.