పాక్ టీవీ కార్యాలయం ధ్వంసం
సచివాలయంపై దాడి, నిలిచిపోయిన ఇంటర్‌నెట్, మొబైల్ సేవలు
తీవ్ర రూపం దాలుస్తున్న ఆందోళనలు
ముగ్గురు మృతి, 500 మందికి గాయాలు
ఇమ్రాన్‌తో చేయి కలిపిన మియాందాద్
పాకిస్తాన్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి) : పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ రాజీనామా కోరుతూ తెహ్రీక్-ఇ-పాకిస్థాన్ అధినేత ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ నేత తహిరుల్ ఖాద్రీల ఇస్లామాబాద్ ముట్టడి తీవ్ర ఆందోళనల మధ్య కొనసాగుతోంది. సోమవారం రాజధాని నగరమైన ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులు జాతీయ ఛానల్ పీటీవీ కార్యాలయంపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. దీంతో ప్రసారాలు నిలిచిపోయాయి. సచివాలయంపై ఆందోళనకారులు దాడిచేశారు. ఇంటర్‌నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయి. జాతీయ అసెంబ్లీని ముట్టడించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాదళాలు భాష్పవాయుగోళాలు, రబ్బర్‌బుల్లెట్లను ప్రయోగించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆందోళనకారులను టీవీ కార్యాలయం నుంచి బయటకు పంపించివేశాయి. తరువాత ప్రసారాలను పునరుద్ధరించారు. నవాజ్‌షరీఫ్ రాజీనామా చేయాల్సిందేనని ఇమ్రాన్‌ఖాన్, తహిరుల్‌ఖాద్రీలు డిమాండ్ చేశారు. దేశమంతా నవాజ్ వెళ్లిపో అనే నినాదం ఇస్తోందని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. పాక్ సైన్యం మాత్రం దేశఅంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది. అయితే ఆందోళనలు శాంతియుతంగా వుండాలని విజ్ఞప్తిచేసింది. ఇదిలావుండగా పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో ఆ దేశ సైన్యాధ్యక్షుడు రహీల్‌షరీఫ్ సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న అశాంతిని తొలగించడంపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లోని రెడ్‌జోన్ ప్రాంతం (జాతీయ అసెంబ్లీ, ప్రధాని నివాసం తదితర కీలక కార్యాలయాలు వుండే ప్రాంతం)లో గత రెండురోజులగా జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ రాజీనామా చేసినట్టు వచ్చిన వార్తలను పాక్ అధికార వర్గాలు ఖండించాయి. శనివారం రాత్రి జరిగిన దాడులకు సంబంధించి ఇమ్రాన్‌ఖాన్, ఖాద్రీపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు.