ప్రైవేట్ ఇంజినీరింగ్ యాజమాన్యాలకు షాక్
ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ
అడ్డగోలు ఫీజుల వసూళ్లకు చెక్
మలి విడత కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి) : ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు ఉన్నత విద్యామండలి గట్టి షాక్ ఇచ్చింది. ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలోనే జరుగుతుందని విద్యామండలి అధికారులు తెలిపారు. దీంతో అడ్డగోలు ఫీజుల వసూలుకు అడ్డుకట్ట పడనుంది. ప్రతిభతో సంబంధం లేకుండా సీట్లను భర్తీచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని విద్యామండలి హెచ్చరించింది. సీట్ల భర్తీని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో వుంచాలని మండలి ఆదేశించింది. సీట్ల భర్తీపై ఈ వారంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరగనుంది. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి మలివిడత కౌన్సెలింగ్ త్వరలో జరగనుంది. తొలివిడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారు కూడా ఇందులో మార్పు చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే తొలివిడత కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్న విద్యార్థులు కూడా మలివిడతలో పాల్గొనవచ్చు. మలి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 2 లేక 3వ వారంలో జరిగే అవకాశం ఉంది. దీనికి ముందు ఎంసెట్- బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీంతో పాటు సమాంతరంగా ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వీటి అనంతరమే రెండో విడత ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల తొలి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 1,89,088 సీట్లు ఉండగా.. 1,16,029 సీట్లు భర్తీ అయ్యాయి. 73,059 సీట్లు భర్తీకి నోచుకోలేదు. తెలంగాణలో 149 కళాశాలల్లో 68,516 సీట్లకు 52,839సీట్లు భర్తీ అయ్యాయి. 15,677సీట్లు మిగిలాయి. తెలంగాణలోని 174 కళాశాలలు కౌన్సెలింగ్‌కు దూరమైనప్పటికీ సీట్లు మిగలడం గమనార్హం. ఏపీలో 1,20,572 సీట్లకు గాను 63,190 భర్తీ అయ్యాయి.
రుసుము చెల్లింపు…
సీటు పొందిన విద్యార్థులు సోమవారం నుంచి శుక్రవారం మధ్య పేర్కొన్న తేదీల్లో మాత్రమే సహాయ కేంద్రాలను (ధ్రువపత్రాల పరిశీలన జరిగిన చోట) సంప్రదించాలి. చలానా రూపంలో ఇండియన్ బ్యాంక్ లేదా ఆంధ్రా బ్యాంక్‌లో రుసుము (సీటు కేటాయింపు పత్రంలో పేర్కొన్న విధంగా) చెల్లించాలి. చలానాను సహాయ కేంద్రాల్లో చూపిస్తే.. దానిపై సహాయ కేంద్రాల నిర్వాహకులు సంతకం చేస్తారు. దాని ఆధారంగా విద్యార్థులు కళాశాలల్లో సెప్టెంబరు 6వ తేదీలోగా రిపోర్టు చేయాలి.
సహాయ కేంద్రాలను సంప్రదించాల్సిన తేదీలు : 1 నుంచి 50,000 మధ్య ర్యాంకులు కలిగిన వారు సెప్టెంబరు 1న, 50,001-1,00,000 ర్యాంకు విద్యార్థులు 2న, 1,00,001-1,50,000 ర్యాంకుల మధ్యవారు 3న, 1,50,001 నుంచి చివరి ర్యాంక్ వరకు 4న సహాయ కేంద్రాలను సంప్రదించాలి. ఈ తేదీల్లో సహాయ కేంద్రాలకు వెళ్లలేని విద్యార్థులు సెప్టెంబరు 5న వెళ్లొచ్చు. 6వ తేదీలోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి : మలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొనదల్చిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలను కళాశాలల యాజమాన్యాలకు అప్పగించకూడదు. ఫీజు చలానానూ ఇవ్వకూడదు. ప్రత్యేక ఫీజునూ చెల్లించకూడదు. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేయకూడదు. ఈ మేరకు నిబంధనలు ఉన్నాయి. మలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటే ఒరిజనల్స్‌ను, ఫీజు చలానాను విద్యార్థులు కళాశాలల్లో అందచేయవచ్చు. మలివిడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు మళ్లీ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో మరొకచోట సీటు కేటాయింపు జరిగితే మాత్రం.. తొలుత వచ్చిన సీటు రద్దవుతుంది. సీటు కేటాయింపు జరగకుంటే.. తొలుత కేటాయించిన సీటు అలాగే ఉంటుంది.