చిత్రకారుడు బాపుకు కన్నీటి వీడ్కోలు

1

చెన్నై, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తన చిత్రాలతో అద్భుత ప్రపంచాన్ని సృష్టించిన అపర బ్రహ్మ ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపుకు పలువురు కన్నీటి వీడ్కోలు  పలికారు. తన మిత్రుడిని వెతుక్కుంటూ వెళ్లిపోయిన బాపు అంత్యక్రియలు చెన్నైలోని బీసెంట్‌నగర్‌ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర బీసెంట్‌నగర్‌ శ్మశాన వాటిక వరకు కొనసాగింది. బాపు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఏపీ సమాచారశాఖ మంత్రి ప్లలె రఘునాథరెడ్డి, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీనటులు రావి కొండలరావు, బోనీ కపూర్‌, అనిల్‌ కపూర్‌, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బాపు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు బాపు పార్థివదేహానికి ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తరపున మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి నివాళులర్పించారు. తెలుగు చలనచిత్రంలో ఓ ధ్రువ తారగా బాపు వెలుగొందారన్నారు. గోదావరి తీరాన బాపు-రమణ విగ్రహాలు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. కొత్త రాజధానిలో ఏర్పడే కళాక్షేత్రానికి బాపు-రమణ పేరు పెడతామని, అలాగే విజయవాడలోని మ్యూజియంకు బాపు పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. బాపు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, బాపు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.