మలి విడత కౌన్సెలింగ్‌పై ప్రతిష్టంభన

2

మా కౌన్సెలింగ్‌ మేమే నిర్వహించుకుంటాం

రెండో విడత కౌన్సెలింగ్‌ ఉండదు

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : మలివిడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. మా కౌన్సెలింగ్‌ మేమే నిర్వహించుకుంటామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌ ఉండదని చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడారు. రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌, ఎంసెట్‌ కన్వీనర్‌ పదవీకాలం పొడిగింపుపై రెండు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల మధ్య వివాదం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఏపీ ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకోవడం సరికాదని పాపిరెడ్డి తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేసినా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించబోదని తేల్చిచెప్పారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల విషయంలో ఏపీ మండలి జోక్యం అవసరంలేదని స్పష్టంచేశారు. తెలంగాణలో సీట్లు తామే భర్తీ చేసుకుంటామని చెప్పారు. ఎంసెట్‌ కన్వీనర్‌ రఘునాథ్‌ పదవీ కాలం పొడిగింపుతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధంలేదని పేర్కొన్నారు. ఆయన ఏపీ ఉన్నత విద్యామండలిలో పని చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ఇన్‌చార్జిగా నియమించుకుంటామని తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తాజా ప్రకటన నేపథ్యంలో మళ్లీ ప్రతిష్టంబన నెలకొంది. తొలి నుంచీ  ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరకు కోర్టుల జోక్యంతో తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. అయితే త్వరలోనే రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏపీ మండలి ఏర్పాట్లు చేపట్టింది. అలాగే, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ విషయంలోనూ మార్గదర్శకాలు జారీచేసింది. కేవలం ప్రతిభ ఆధారంగానే మేనేజ్‌మెంట్‌ సీట్లు భర్తీచేయాలని స్పష్టంచేసింది. అయితే, రెండో విడత కౌన్సెలింగ్‌పై తెలంగాణ ఉన్నత విద్యామండలి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వసతులు లేని 174 ఇంజినీరింగ్‌ కళాశాలలకు ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ కాలేజీలు కోర్టుకు వెళ్లడంతో నిబంధనలు పాటించిన కాలేజీలకు అనుమతులు పునరుద్ధరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, నిబంధనలు పాటించని కళాశాలల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం వాటికి ఈ ఏడాది ప్రవేశాలు కల్పించకూడదనే గట్టి ఉద్దేశ్యంతో ఉంది. అందుకే రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించవద్దని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండో విడత ఉండదని ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువడడం గమనార్హం.