ఖమ్మం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం

3

మంత్రి ఈటెల రాజేందర్‌

ఖమ్మం, సెప్టెంబర్‌ 2 ( జనంసాక్షి) : ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి టిఆర్‌ఎస్‌  ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఈ మేరకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కూసుమంచిలో విలేకరులతో మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించే యోచన చేస్తున్నామన్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగంలోకి తీసుకుని రావాలని చూస్తున్నామని అన్నారు. అలాగే దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. టిఆర్‌ఎస్‌ చేపడుతున్న అనేక కార్యక్రమాలను చూసిన తరవాతనే ఇక్కడి వివిధ పార్టీల నేతలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.  టిడిపి, కాంగ్రెస్‌, వైకాపా పార్టీల నేతల చేరికతో ఖమ్మం జిల్లాలో తెరాస బలోపేతం కానుందని అన్నారు. అలాగే వీరి చేరిక వల్ల తమ బాధ్యత కూడా పెరిగిందన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించడం వల్లనే వీరంతా అభివృద్దిని కాంక్షించి వస్తున్నారని అన్నారు.  తెరాస జిల్లా అధ్యక్షుడు దండిగల రాజేందర్‌, పాలేరు నియోజకవర్గ ఇంఛార్జి సోమయ్య పలువురు నాయకులు మంత్రి ఈటెల రాజేందర్‌కు స్వాగతం పలికారు. టిడిపికి ఎంపీపీ, జడ్పీటీసీల రాజీనామా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతుగా రఘునాథపాలెం మండలం ఎంపీపీ మాలోతు శాంత, జడ్పీటీసీ అజ్మీరా ఈరూనాయక్‌ సహా ఎంపీటీసీలు, సర్పంచులు, టిడిపి మండల కార్యవర్గం మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు మందడపు సుధాకర్‌, ఎంపీపీ, జడ్పీటీసీ, టిడిపి  మండల అధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, తొమ్మిది మంది ఎంపీటీసీలు, ఆరుగురు సర్పంచులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రఘునాథపాలెం సొసైటీ అధ్యక్షుడు తాతా రఘురాం, టిడిపి గ్రామ శాఖల అధ్యక్ష కార్యదర్శులు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని తమ మద్దతు ఆయనకే ఉంటుందని వారు స్పష్టంచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు బోడేపూడి రమేశ్‌బాబు తెలిపారు. అభివృద్ధిని గుర్తించే తుమ్మలను తెరాసలోకి ఆ పార్టీ అధినేత ఆహ్వానించారని పేర్కొన్నారు. మండల, పట్టణానికి చెందిన సుమారు 200మంది టిడిపి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తుమ్మలతోపాటు తెరాసలో చేరుతున్నారని తెలిపారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరుతామని స్పష్టంచేశారు. ఎన్నికలకు ముందు జిల్లా పార్టీలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన సంక్షోభంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇల్లెందు మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత టిడిపికే చెందుతుందని తెలిపారు.