తెలంగాణ విద్యుత్‌ ప్రాజెక్టులకు మేము సైతం

4
రూ.20వేల కోట్ల రుణమిచ్చేందుకు ముందుకొచ్చిన ఆర్‌ఇసి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణలో స్థాపించే విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం రూ.20వేల కోట్ల రుణం మంజూరుచేయడానికి రూరల్‌ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఇసి) ముందుకొచ్చింది. ఆర్‌ఇసి సిఇఓ రాజీవ్‌శర్మ, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో స్థాపించబోయే విద్యుత్‌ ప్రాజెక్టులు, దానికయ్యే వ్యయం, వనరుల సమీకరణ తదితర అంశాాలపై సమీక్ష జరిగింది.  తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజక్టులు, పరిశ్రమలు, ఐటిఐఆర్‌ ప్రాజెక్టు, మంచినీటి గ్రిడ్‌ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నందున ఇప్పటికన్నా ఎక్కువ కరెంటు డిమాండ్‌ భవిష్యత్‌లో ఎక్కువ ఉంటుందిన ముఖ్యమంత్రి చెప్పారు. దీనికనుగుణంగానే తెలంగానలో ప్రస్తుతమున్న 8వేల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్‌ ప్లాంట్లకు అనుబంధంగా మరో 12వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. తక్షనం విద్యుత్‌ సమ్యలు అధిగమించడానికి స్వల్పకాలిక వ్యూహం, రాబోయే కొద్ది సంవత్సరాల అవసరాలు తీరేందుకు మధ్యతరహా కార్యక్రమాలు, రాబోయే పది పదిహేనేళ్ళపాటు విద్యుత్‌ కోత లేకుండా ఉండే దీర్ఘకాలిక కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,700 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటే, 4417మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల, పిపిఎల ద్వారా మరికొంత విద్యుత్‌ సమకూర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. భూపాలపల్లి కెటిపిఎస్‌, జైపూర్‌ సింగరేణిలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల విస్తరణకు సంబంధించిన పనులను కూడా సమీక్షించారు. వచ్చే ఏడాది చివరకు 2800 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేవిధ:గా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూపాలపల్లిలో వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 600 మెగావాట్ల విద్యుత్‌, ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ ప్లాంటు ద్వారా సింగరేణి నుంచి 1200 మెగావాట్లు వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి, కేంద్రం వాటా కింద రావాల్సిన 1000 మెగావాట్లు వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే తెలంగాణలో విద్యుత్‌ కొరత కొంతమేరకు అధిగమించవచ్చని కూడా సిఎం ఆశాభావం వ్యక్తంచేశారు.