పెట్టుబడులకు ఇండియానే సేఫ్‌

5

మీ సాఫ్ట్‌వేర్‌ మా హార్డ్‌వేర్‌ కలిస్తే అద్భుతం

భారత్‌ బుద్ధుడి మార్గంలోనే పయనిస్తుంది

జపాన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ

టోక్యో, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : పెట్టుబడులకు భారతదేశంలో పూర్తి రక్షణ ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జపాన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇండియా హార్డ్‌వేర్‌ కలిస్తే అద్భుతాలు సృష్టించొచ్చని చెప్పారు. భారత్‌ బుద్ధుడి మార్గంలోనే పయనిస్తుందన్నారు. జపాన్‌ పర్యటనలో భాగంగా మంగళవారం నాలుగో రోజు భారత  ప్రధాని మోడీ బిజీబిజీగా గడిపారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ఇక్కడి ప్రముఖులను కలుసుకున్నారు. టీసీఎస్‌ జపాన్‌ సాంకేతిక, సాంస్కృతిక అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారుడికి సవాల్‌ విసురుతూ మోడీ సరదాగా కాసేపు డ్రమ్స్‌ వాయించారు. వివిధ పార్టీల నేతలతో మోడీ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జపాన్‌ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ అక్కడి పారిశ్రామిక వేత్తలతో టోక్యోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కన్నా ఉత్తమమైన దేశం ఏదీ లేదన్నారు. ఇటీవల రక్షణ సహా అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. జపాన్‌లో పదేళ్లలో విూరు సాధించిన అద్భుతాన్ని రెండేళ్లలో భారత్‌లో ఆవిష్కరించవచ్చని పారిశ్రామికవేత్తలను కోరారు. ఇప్పుడు భారత్‌ అవకాశాల స్వర్గం, రండి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఉత్పత్తి రంగం బలోపేతానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. గత రెండున్నర, మూడేళ్లుగా చేయలేని పనిని వందరోజుల్లో చేసి చూపించామన్నారు. ఎలక్ట్రికల్‌, ఎలక్టాన్రిక్స్‌, లోకో మోటివ్‌ సహా వందల రంగాల్లో ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయన్నారు. పునరుత్పాదక రంగంలోనూ ఎన్నో అవకాశలు ఉన్నాయన్నారు. భారత్‌-జపాన్‌ మధ్య సంబంధాల బలోపేతానికి వాజ్‌పేయి కృషిచేశారన్నారు. అంతకుముందు టోక్యోలోని సెక్రెడ్‌ హాట్‌ విశ్వవిద్యాలయంలో జపాన్‌ విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంతో కలిసి పురోగతి సాధిద్దామని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇతరుల గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచిద్దామని నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలను సమ్మిళితం చేయాలని విద్యార్థులకు సూచించారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మాయిల విద్యకు కృషిచేసినట్లు వెల్లడించారు. భారత్‌లో ప్రకృతిని భగవంతుడితో సమానంగా ఆరాధిస్తామని ప్రకృతిని దోచుకోవడం నేరమని పిల్లలకు నేర్పిస్తామన్నారు. మన అలవాట్ల వల్లే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. ప్రకృతితో భారతీయులకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు. ప్రకృతితో సంఘర్షణ వద్దు… సంవాదం చేద్దామని పిలుపునిచ్చారు. భారత్‌ బుద్ధుడి ప్రదేశం బుద్ధుడి మార్గంలోనే అహింసకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ప్రపంచం ఓ కుటుంబం, వేల ఏళ్లుగా ఇలాగే జీవిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జపాన్‌ విద్యార్థులను మోడీ భారత్‌కు ఆహ్వానించారు. కార్యక్రమంలో మోడీతోపాటు జపాన్‌ ప్రధాని షింజో అబే పాల్గొన్నారు.

పరిశుద్ధ భారత్‌ కోసం తపన

టోక్యోలోని వివేకానంద సెంటర్‌లో భారతీయులతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మొదటి లక్ష్యం పరిశుద్ధ భారతేనని తెలిపారు. 2019నాటికి ఇండియా ఇమేజ్‌ను పూర్తిగా మార్చేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. పరిశుభ్ర భారత్‌ అనేది కత్తివిూద సాములాంటిదన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. తలపాగా, చీరకట్టు వంటి పోటీల వల్ల తమ సంప్రదాయాల పట్ల పిల్లల్లో అవగాహన వస్తుందని చెప్పారు. భారతీయుల వాణి వినిపించేందుకే ఇక్కడికి వచ్చానని స్పష్టంచేశారు. జపాన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు భారతవాణి వినిపించానని చెప్పారు. భారతీయతకు ప్రాచుర్యం కల్పించాలన్నారు. అనేక మంది భారతీయులు తూర్పు ఆసియాకు శ్రామికులుగా వలస వెళ్లారని తెలిపారు. శ్రామికులుగా వెళ్లిన తమవారు ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల 10వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జపాన్‌ ముందుకొచ్చిందని చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల్లో నమ్మకం అనేది ప్రధానమని తెలిపారు. జపాన్‌కు తమంతా కలిసి ఆ నమ్మకం కల్పించామని పేర్కొన్నారు. అంతకుముందు టోక్యోలోని సేక్రెడ్‌ హార్డ్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ అభివృద్ధిలో మహిళల పాత్ర మరువలేనిదని ఆయన కొనియాడారు. ఆసియాలోని చాలా దేశాల్లో మహిళా పరిపాలకులు తమదైన ముద్ర వేశారంటూ సోదాహరణంగా వివరించారు. సైన్స్‌ టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధి, ప్రకృతి నియమాలకు లోబడే ఉండాలని మోదీ హితవు పలికారు. శాస్త్రీయ ధృక్పధం జీవన కళకు దోహదకారిగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కొందరు విద్యార్థులు చైనా గురించి అడిగిన ప్రశ్నలకు మోదీ జవాబు ఇవ్వలేదు. మనసంగతి మనం చూసుకుందామని అని దాటవేశారు. మనం ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నాం. సైన్స్‌ టెక్నాలజీ, కంప్యూటర్లు వంటి రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామని మోదీ అన్నారు. ఈ విద్యా వ్యవస్థ ద్వారా మన పిల్లలను రోబోలుగా మార్చేస్తున్నామా అని అప్పుడప్పుడూ భయం వేస్తుందని ఆయన అన్నారు. టెక్నాలజీ ఎంతైనా పెరగనీ, ఎన్ని రోబోలనైనా తయారుచేయనీ అదే సమయంలో మానవతా స్పర్శలేని జీవితం నిరర్థకమని ఆయన వ్యాఖ్యానించారు.